ఫ్యాక్షన్ చేస్తానన్న పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి - JC Prabhakar Reddy demands
🎬 Watch Now: Feature Video
JC Prabhakar Reddy : ఫ్యాక్షన్ చేస్తానన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అతని కుమారులను నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాడిపత్రి పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. పోలింగ్ రోజు తమ కార్యకర్త ఇంటిపై దాడి చేశారని గుర్తు చేశారు.
తన ట్రావెల్స్‌పై, తనపై అక్రమ కేసులకు సంబంధించి అధికారులకు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఈ నెల 24వ తేదీన మరోసారి అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుపై ఫిర్యాదు చేస్తానన్నారు. పోలింగ్ రోజు అల్లర్లపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదన్నారు. న్యాయం జరిగే వరకూ తాను పోరాడుతానని చెప్పారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తాము పెట్టిన కేసులపై విచారణ చేయాలని కోరారు. పెద్దారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దారెడ్డిని అతని కుమారులని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
జేసీ అస్మిత్ రెడ్డి ప్రమాణ స్వీకారం : తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. తాడిపత్రి మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా జేసి అస్మిత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.