జమ్మలమడుగులో టెన్షన్ - భారీగా పోలీసుల మోహరింపు - ప్రధాన పార్టీల అభ్యర్థులు గృహనిర్బంధం - Political Leaders House Arrest - POLITICAL LEADERS HOUSE ARREST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 1:36 PM IST
Jammalamadugu Constituency Political Leaders House Arrest by Police : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మే 13 జరిగిన పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ, కూటమి వర్గీయుల మధ్య ఘర్షణలు జరగడం, రెండు రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గొడవలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగుకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీల అభ్యర్ధులు, ప్రధాన నాయకులను గృహ నిర్భంధం చేశారు. జమ్మలమడుగులో దాదాపు 500 మంది పోలీసు బలగాలు మోహరించాయి.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని ఎర్రగుంట్ల మండలంలోని ఆయన స్వగ్రామం నిడిజువ్విలో గృహనిర్బంధం చేశారు. ఇక జమ్మలమడుగు మండలం దేవగుడిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడప పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రెండు ప్రాంతాల్లోనూ స్పెషల్ పార్టీ పోలీసులతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జమ్మలమడుగులోని మూడు ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద కూడా బలగాలను మోహరించారు. మూడు పార్టీలకు చెందిన 20 మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.