డీమార్ట్కెళ్లాడు, చాక్లెట్స్ తిన్నాడు, అరెస్ట్ అయ్యాడు - కారణం 'వైరల్'
🎬 Watch Now: Feature Video
Instagram Influencer DMart Chocolate Video Arrest : ఈ రోజుల్లో ఏ చిన్న పని చేసినా, దానిని సెల్ఫోన్లలో బంధించడం చాలా మందికి ఉన్న అలవాటు. నలుగురిలో కాస్త పాపులర్ కావడానికి ఆ వీడియోలతో రీల్స్ గట్రా చేస్తూ నచ్చితే లైకులు, బాగుంటే షేర్లు చేయండంటూ వాళ్ల ప్రయత్నాలేవో వాళ్లు చేస్తుంటారు. ఇలాంటివి కొన్నిసార్లు వర్కౌట్ అయ్యి, రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్స్‌గా మారిన వారున్నారు. అదే సమయంలో చిక్కుల్లో పడ్డవారూ లేకపోలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఆ యువకులకు ఎదురైంది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్‌లోకి ఇటీవల హనుమంత్ నాయక్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అందులో అమ్మకానికి ఉంచిన కొన్ని చాక్లెట్లను తీసుకుని ట్రయల్ రూమ్‌లోకి వెళ్లి తింటూ వీడియో తీసుకున్నాడు. ఆపై డీమార్ట్‌లో బిల్లు చెల్లించకుండా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అది కాస్తా వైరల్ అయి, డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ దృష్టికి రావడంతో ఆయన ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చాక్లెట్లను తస్కరించిన హనుమంత్ నాయక్‌తో పాటు అతడికి సహకరించిన స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.