ప్రభుత్వ ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి: హైకోర్టు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 3:42 PM IST
High Court on Government Advertisements: ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు నిబంధనలను విరుద్ధంగా ఉన్నాయని చెన్నుపాటి సింగయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీని ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇచ్చారని పిటిషన్లో ఆయన పేర్కోన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. 2015లో మీడియాలో ఇచ్చే ప్రకటనలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, వ్యక్తులను గొప్పగా చిత్రీకరించే విధంగా ప్రకటనలివ్వొద్దని సుప్రీం మార్గదర్శకాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చారన్న న్యాయవాది, గత ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రకటనలు ఉన్నాయని వాదనలు వినిపించారు. ప్రకటనల కోసం చేసిన ఖర్చును సదరు రాజకీయ పార్టీ నుంచి వసూలు చేయాలని న్యాయవాది కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.