ఆరోగ్య కార్యకర్తల ఆందోళన - ఐటీడీఏ కార్యాలయం ముట్టడి
🎬 Watch Now: Feature Video
Health workers protest in front of ITDA office: అల్లూరి జిల్లా పాడేరులో ఐటీడీఏ (ITDA) కార్యాలయాన్ని ఆరోగ్య కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలను పోలీసుల అడ్డుకోగా, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నతమకు ఆశ కార్యకర్తలుగా మార్చాలంటూ డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోయారు. 750 మంది ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
సంవత్సరాల తరబడి సమస్యల పరిష్కారం కోసం విన్నపాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకపోగా కొత్త పోస్టులు తీస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆరోగ్య కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల కోసం పోరాడుతుంటే పోలీసు అడ్డుకున్నారని ఆరోపించారు. తమను ఆశ కార్యకర్తలుగా గుర్తించే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న కార్మిక నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.