యశస్వి విదేశాలకు వెళ్లొచ్చు- సీఐడీ లుక్అవుట్ నోటీసు రద్దు చేసిన హైకోర్టు - ఎన్నారై యశస్వికి హైకోర్టులో ఊరట
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2024/640-480-20627114-thumbnail-16x9-hc-on-nri-yashaswi-petition.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 7:50 PM IST
HC on NRI Yashaswi Petition: ఎన్నారై యశస్వికి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ ఇచ్చిన లుక్అవుట్ నోటీసును రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచితంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై యశస్విపై సీఐడీ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. ఇండియాకు వచ్చిన యశస్విని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి గతంలో 41ఏ నోటీసులు ఇచ్చారు. లుక్‌అవుట్ నోటీసును ఇంకా కొనసాగించడంతో యశస్వి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ అధికారులు ఇచ్చిన లుక్అవుట్ నోటీసును ఎత్తివేయాలని కోర్టును కోరారు.
ఇప్పటికే సీఐడీ అధికారులు యశస్విని అరెస్ట్ చేసి 41ఏ నోటీసులు ఇచ్చారని పిటిషనర్ తరుఫు న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత లుక్‌అవుట్ నోటీసు కొనసాగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సీఐడీ అధికారులు యశస్విని రెండుసార్లు విచారించారని తెలిపారు. ఈ క్రమంలో అరెస్ట్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని లుక్‌అవుట్ నోటీసును ఎత్తివేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం లుక్‌అవుట్ నోటీసును రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ విదేశాలకు వెళ్లవచ్చని తెలిపింది.