ఏజీ శ్రీరామ్, స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డిపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ - హైకోర్టులో నేడు విచారణ - సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 1:09 PM IST
HC on Advocate General: అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల స్టాండింగ్ కౌన్సిల్ ఎం.మనోహర్ రెడ్డి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డి నియామక జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వ్యాజ్యంలో ఏజీ శ్రీరామ్, స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు న్యాయశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.కృష్ణమోహన్ ఈరోజు ఈ వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు.
2019లో మనోహర్ రెడ్డిని స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ న్యాయవాది సాల్మన్ రాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే సాల్మన్ రాజును ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించారు. వ్యాజ్యం వేసిన న్యాయవాది హాజరు కాకపోవడంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇది క్విడ్ ప్రోకోగా పరిగణించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తెలిపారు. మూడో విడత స్టాండింగ్ కౌన్సిల్‌గా మనోహర్ రెడ్డి నియామకమే వివాదాస్పదమైందని, అలాంటప్పుడు నాలుగో విడత ఆయననే నియమించడాన్ని చూస్తుంటే ఏజీ అవినీతి కార్యకలాపాలపై సందేహం కలుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఏజీ శ్రీరామ్, స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డిపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. మనోహర్ రెడ్డి నియామక జీవోను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.