గుంటూరు మిర్చి యార్డుకు పోటెత్తిన సరుకు - తీసుకురావద్దన్న అధికారులు - Guntur Mirchi Yard Crowd
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 10:11 PM IST
Guntur Mirchi Yard Receives Huge Stocks of Red Chillies : గుంటూరు మిర్చియార్డు మెుత్తం సరుకుతో నిండిపోయింది. రోజూ లక్షన్నర బస్తాల మిర్చి వస్తుండటంతో యార్డులో ఎటు చూసినా మిర్చి బస్తాలే కనిపిస్తున్నాయి. సాధారణంగా గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ నుంచి ఇక్కడకు రైతులు మిర్చి తీసుకువస్తుంటారు. ఫిబ్రవరి నెలలో యార్డులో రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి కూడా రైతులు మార్కెట్కు మిర్చి తీసుకురావటంతో రద్దీ పెరిగిందని అధికారులు అంటున్నారు. సరుకు తీసుకువచ్చిన వాహనాలతో యార్డులో రద్దీ పెరిగిపోయింది.
మార్కెట్లో రద్దీ తగ్గించేందుకు శుక్రవారం నాడు సరుకు తీసుకురావొద్దని మార్కెట్ యార్డు అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యార్డులో ఉన్న సరుకు క్లియర్ చేసిన తర్వాతే కొత్త సరుకును అనుమతిస్తామని మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం వచ్చే సరుకును కొనుగోలు చేయరు కాబట్టి రైతులు ఈ విషయం గమనించి రావొద్దని తెలిపారు. మార్కెట్కు సరుకు ఎక్కువగా వస్తుండటంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోయారు. చాలా దూరం నుంచి సరుకు తీసుకువచ్చామని పెట్టుబడులు, రవాణా ఖర్చులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు.