శ్రీకాళహస్తిలో జ్ఞానాంబిక కళ్యాణోత్సవం- ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 1:15 PM IST
|Updated : Mar 11, 2024, 1:26 PM IST
Gnana Prasunambika Devi Kalyanotsavam: తిరుపతి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో ఆలయంలో కొలువుదీరారు. స్కందరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే జ్ఞానాంబిక, సోమస్కందమూర్తి కల్యాణోత్సవం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. బ్రహ్మాది సమస్త దేవతలు, యక్ష, కిన్నెర, కింపురషాదులతో పాటు సప్తరుషులు, మునిశ్రేష్ఠులు అందరు దక్షిణ కైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తిలో అడుగిడటంతో పెళ్లి వేడుకలకు సిద్ధమైంది. స్వామి వారు గజవాహనం, జ్ఞానాంబికా దేవి సింహ వాహనాలను అధిరోహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఒప్పించిన పెళ్లి పెద్దలు స్వామివారితో వివాహాన్ని నిశ్చయించి అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకువచ్చే ప్రక్రియను నిర్వహించారు.
Mahashivratri Brahmotsavam at Srikalahasti: అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామ స్మరణల మధ్య శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో నూతన వధూవరులు పాల్గొన్నారు. స్వర్ణాభరణ ట్రస్టు ఆధ్వర్యంలో వారికి బంగారు తాళిబొట్లు, పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు అందజేశారు. స్వామి, అమ్మవారులను ఆలయానికి తీసుకువెళ్లి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.