కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన- పిలవకపోయినా హాజరైన మంత్రి బుగ్గన - కోర్టు భవనం పనులు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 12:11 PM IST
Foundation Laying of Court Buildings in Dhone: నంద్యాల జిల్లా డోన్‌లో న్యాయస్థాన భవనాల సముదాయ నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోయినా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, ఎన్.హరినాథ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి రాజకీయ నాయకులను ఆహ్వానించకూడదన్న ఉద్దేశంతో మంత్రి బుగ్గనను పిలవలేదు. శిలాఫలకం, ఆహ్వానపత్రంలోనూ మంత్రి పేరు లేదు. కానీ ఆయనతో పాటు జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి కూడా కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు.
భవన సముదాయానికి సంబంధించిన అంశాలను అధికారులు హైకోర్టు న్యాయమూర్తులకు వివరిస్తుండగా మధ్యలో మంత్రి జోక్యం చేసుకుని వివరాలు వెల్లడించారు. శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సీఎం జగన్, మంత్రి బుగ్గన చిత్రాలతో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా, తాము మంత్రిని ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. మంత్రి నియోజకవర్గ పరిధి కావడంతో అనుకోకుండా వచ్చారని పేర్కొన్నారు. అటు జ్యుడీషియల్ కార్యక్రమానికి మంత్రి హాజరు కావడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు.