ధర్మవరంలో ఉద్రిక్తత- మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల అరెస్ట్ - మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల అరెస్ట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 1:38 PM IST
Former MLA Suryanarayana Arrest: సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్ యార్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గుంతల పడిన రహదారులను మరమ్మతులు చేయడానికి సామగ్రితో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ అండ్ బీ రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరమ్మతులు చేయాలని గోనుగుంట్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. జనవరి నెలాఖరు లోపు రోడ్డు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు.
గడువులోపు గుంతలు పూడ్చకపోతే తానే స్వంత ఖర్చుతో మరమ్మతులు చేయిస్తానని సూర్యనారాయణ అధికారులకు చెప్పారు. జనవరి 31తో గడువు ముగియడంతో గుంతలు పూడ్చడానికి యత్నించిన గోనుగుంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యేకు మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసుల అడ్డుకోవడంతో సూర్యనారాయణ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎప్పటిలోపు రోడ్డు మరమ్మతులు చేస్తారో చేప్పాలని గోనుగుంట్ల డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు సూర్యనారాయణను అరెస్టు చేసి ధర్మవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.