హంస వాహన తెప్పోత్సవానికి వరద తిప్పలు - దుర్గాఘాట్ దగ్గరే నిర్వహణ - FLOOD ON HAMSA VAHANA TEPPOTSAVAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2024, 5:52 PM IST
Flood Obstruct Hamsa Vahana Teppotsavam in Prakasam Barrage : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవానికి వరద ఉద్ధృతి ప్రతిబంధకంగా మారింది. ఇటీవల భారీ వర్షాలకు అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండడమే కాకుండా తాజాగా కురుస్తున్న వానలకు కృష్ణానదిలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా 35 గేట్లు ఒక అడుగు తెరిచి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ గేట్లు తెరిచి ఉండడం, నీటి ఉద్ధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వస్తోన్న సమాచారంతో జలవనరులశాఖ అధికారులు కృష్ణానదిలో తెప్పోత్సవ నిర్వహణకు అనుమతులు నిరాకరించారు.
తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు భారీ పంటు వినియోగిస్తారు. నీటి ఉద్ధృతి సమయంలో దీన్ని నియంత్రించడం కష్టం. అలాగే బ్యారేజీ గేట్లకు సమీపంలోనే జలవిహారానికి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లాల్సి ఉన్నందున పంటు అటువైపు జారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా తెప్పోత్సవాన్ని జలవిహారంగా కాకుండా దుర్గాఘాట్ వద్దనే నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.