రామోజీరావు మృతితో శోకసంద్రంలో మత్స్యకార కుటుంబాలు- మహనీయుడికి ఘన నివాళి - Fishermen Tribute to Ramoji Rao - FISHERMEN TRIBUTE TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 4:33 PM IST
Fishermen Tribute to Ramoji Rao: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సముద్ర తీర ప్రాంతంలో నిరుపేద మత్స్యకార, నిరుపేద కుటుంబాలు 'ఈనాడు' అధినేత రామోజీరావు మృతితో శోకసంద్రంలో మునిగిపోయాయి. హుద్ హుద్ తుపాను సమయంలో మత్స్యకారులకు రామోజీరావు సాయం చేసి ఆదుకున్న వైనాన్ని తలచుకుని కంటతడి పెడుతున్నారు. 2014 అక్టోబరు 12న హుద్ హుద్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో మత్స్యకారులు, పేదల ఇళ్లు నేలమట్టయ్యాయి. బాధితులకు అప్పట్లో రామోజీరావు అండగా నిలిచారు.
పాత మేఘవరం, ఉమిలాడ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'ఈనాడు' రిలీఫ్ ఫండ్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఉమిలాడలో 28, మేఘవరంలో 36 ఇళ్లతో పునరావాస కాలనీ నిర్మించారు. కాలువలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించి దేవాలయం, ఇతర వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. లబ్ధిదారులకు అప్పటి కలెక్టర్ జె.నివాస్ ఇళ్లు అందజేశారు. ఆపదలో ఆపన్నహస్తం అందించిన ఆ మహనీయుడికి ఉమిలాడలో హుద్ హుద్ గృహ సముదాయం వద్ద లబ్ధిదారులు, టీడీపీ నాయకులు రామోజీరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.