వంతెనలు లేక వెళ్లలేకపోతున్న రైతులు - బీడుగా మారిన పొలాలు - HLC Bridge Collapse
🎬 Watch Now: Feature Video
HLC Bridge Collapse: అనంతపురం జిల్లాకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న హెచ్చెల్సీ కాలువ శిథిలమైపోయింది. గత జగన్ ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేయని కారణంగా కాలువ, వంతెనల నిర్వహణ పూర్తిగా కుంటుపడి ఆనవాళ్లు కోల్పోతుంది. తుంగభద్ర జలాశయం నుంచి అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ ప్రధాన కాలువ 189 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. దీనిలో 105 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ కర్ణాటక, ఏపీ ఉమ్మడి ఆయకట్టుగా ఉంది. ఇది పూర్తిగా నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో ఉంది.
ఉమ్మడి ఆయకట్టుగా ఉన్న కాలువను టీబీ బోర్డు ఆధునీకీకరించింది. బోర్డు పరిధిలో ఉన్న కాలువ చక్కటి నిర్వహణతో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్నారు. అయితేే 105 కి.మీ. నుంచి 189 కిలోమీటర్ల వరకు ఏపీ జలవనరులశాఖ పర్యవేక్షణలో ఉన్న కాలువ పూర్తిగా శిథిలమైపోయింది. కొన్నేళ్ల పాటు ఆధునీకీకరణ పనులు నిర్వహించినప్పటికీ, అధికారుల అవినీతి కారణంగా గుత్తేదారుడు ఆదాయం వచ్చే పనులు మాత్రమే నిర్వహించి నాలుగుగేళ్ల క్రితం అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోయాడు.
దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని పనులు రద్దు చేసినట్లుగానే హెచ్ఎల్సీ పనులను రద్దు చేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడంతో హెచ్ఎల్సీ కాలువపై ఏడు వంతెనలు కూలిపోయాయి. ఈ క్రమంలో అటువైపు వ్యవసాయ భూములున్న రైతులు వెళ్లని కారణంగా భూములు బీడు పడ్డాయి. వంతెనలు నిర్మించకపోతే తాము వ్యవసాయం చేయలేమని, ఇప్పటికే భూములు బీడుపెట్టాల్సి వచ్చిందంటున్న రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్, కనేకళ్ హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.