గండ్లు పూడ్చిన తరువాత బుడమేరు ఎలా ఉంది? - డ్రోన్ విజువల్స్ - Budameru Canal Breach Drone Visuals
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 9:40 PM IST
Budameru Canal Breach Drone Visuals: విజయవాడలోని అనేక కాలనీలను పీకల్లోతు కష్టాల్లో ముంచిన బుడమేరుకు ప్రభుత్వం ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. బుడమేరుకు గండ్లు పూడ్చే నిర్విరామ యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఈనెల ఒకటో తేదీన బుడమేరుకు 3 గండ్లు పడగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్ ఏజన్సీని పిలిపించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించింది. 50 మీటర్ల పొడవైన మొదటి రెండు గండ్లనూ త్వరగానే పూడ్చినా మూడో గండి దాదాపు 90 మీటర్లమేర పడడంతో దాన్ని ఆపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జోరువానకు వెరవకుండా ఐదారు రోజులు అహోరాత్రులు పనిచేశామని మంత్రి రామానాయుడు చెప్పారు.
బుడమేరు ఆపరేషన్‌లో అనేక సంక్లిష్టతలు సవాళ్లు విసిరాయి. గండ్లు పడిన చోటకు వాహనాలు వెళ్లడానికి దారిలేదు. దాని కోసం అప్రోచ్ రోడ్ వేయడానికే ఒకరోజు పట్టింది. ఒక వాహనం వస్తే మరోవాహనం వెళ్లడానికి వీల్లేదు. అలాంటి చోట ర్యాంపు వేసుకుని పనులు చేపట్టారు. దాదాపు 1500 టిప్పర్ల రాళ్లు, మట్టిని తరలించాయి. జోరువానలకు వాహనాలు దిగబడినా వాటిని ప్రొక్లైన్లతో లాగిస్తూ రేయింబవళ్లు పనులు కొనసాగించారు. మళ్లీ వరద పెరిగినా కట్ట తెగకుండా వాటిని పటిష్టం చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చివేత డ్రోన్ విజువల్స్‌లో ఈ వీడియోలో చూడొచ్చు.