ఎన్టీఆర్ జిల్లాను మరో ఉద్దానంగా మార్చకండి: సీపీఐ నేతలు - Kidney disease in NTR district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 10:33 AM IST
CPI Shankar Media Conference with kidney Disease Sufferers: కిడ్నీ వ్యాధుల తీవ్రత దృష్ట్యా ఎన్టీఆర్(NTR) జిల్లా ఎ.కొండూరు మండలాన్ని మరో ఉద్దానంగా మార్చవద్దని ఎన్టీఆర్ జిల్లా సీపీఐ(CPI) కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎ.కొండూరు(A.Konduru) మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, శివారు తండాల ప్రజలు మూత్రపిండాల(Kidney) వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, వీరిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని శంకర్ డిమాండ్ చేశారు. కిడ్నీ బాధిత కుటుంబాలతో కలిసి విజయవాడ(Vijayawada) సీపీఐ కార్యాలయంలో శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాల(Krishana Water)ను పైపులైన్ల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధికి గురైన వారికి నెలకు 10వేల రూపాయలు చొప్పున పింఛన్ ఇవ్వాలని, వ్యాధితో చనిపోయినవారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సమస్యను పరిష్కరించాలని శంకర్ కోరారు. ఈ సందర్భంగా ఇద్దరు కిడ్నీ వ్యాధి బాధితులు తమ సమస్యను మీడియాకు వివరించారు.