రాజకీయాలకు వేదికగా ఆడుదాం ఆంధ్రా- స్పందన లేకపోయినా సందడి చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు - ఆడుదాం ఆంధ్రా ముగింపు సభ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 10:24 AM IST
CM Aadudam Andra Ending Meeting in Visakha : ఆడుదాం ఆంధ్రాకు సరైన స్పందన లేకపోయినా ప్రచారం కోసం వైఎస్సార్సీపీ నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. యువ ఓటర్లకు గాలం వేసేందుకు ఐప్యాక్ సూచనతో తెరపైకి వచ్చిన ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయినా ముగింపు వేడుకను రాజకీయ ప్రచార వేదికగా మార్చుకోవడానికి సిద్ధమైపోయారు. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (visakha International Cricket Stadium) మంగళవారం ఈ కార్యక్రమం జరగనుండగా స్టేడియంను రాజకీయాలకు వేదికగా మార్చడంపై క్రీడాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి పోటీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఓటమి పాలైన జట్లు సొంత జిల్లాలకు వెళ్లిపోతుండటంతో ముగింపు వేడుకలో క్రీడాకారులు ఎక్కువ మంది కనపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 24 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంను నింపడానికి ప్రతి సచివాలయం పరిధిలో 45 ఏళ్ల లోపు ఉండి, నవరత్నాలు అందుకుంటున్న లబ్ధిదారులను స్టేడియంకు చేర్చే బాధ్యతను మెప్మా మహిళా సభ్యులకు (MEOMA), వాలంటీర్లకు అప్పగించారు. వాలంటీర్ల వాట్సప్ గ్రూప్‌లకు వాయిస్ మెసేజ్‌ల రూపంలో ఇప్పటికే ఆదేశాలందాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలకు జనసేకరణ బాధ్యతలిచ్చే ప్రయత్నం చేయగా భీమిలి ‘సిద్ధం’ సభకు, సాధికార బస్సు యాత్రలకు జనసేకరణ చేసి అలసిపోయామని, ఇక తమ వల్ల కాదంటూ పలువురు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.