ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు - ఇప్పటివరకూ ఎన్ని కోట్లు వచ్చాయంటే? - AP CM Relief Fund Donations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 5:14 PM IST
AP CM Relief Fund Donations: వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి, విపత్తు నుంచి విజయవాడను గట్టెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు విరాళాలు రావడం ఒక చరిత్ర అని అన్నారు. వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. చిన్నా, పెద్ద ఇలా ప్రజలు అందరూ స్పందించారని, సంఘటితంగా ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బాధితులకు ఇప్పటి వరకూ రూ. 602 కోట్లు విడుదల చేశామని, ఇందులో రూ. 400 కోట్లు దాతలే ఇచ్చారన్నారు. మొత్తం నష్టం 6 వేల 800 కోట్ల రూపాయల మేర జరిగిందని, కేంద్రం ఇచ్చే డిజాస్టర్ ఫండ్‌కు కూడా హద్దులు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ మానవత్వంతో వ్యవహరించాలని ఈ మొత్తం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. వర్షాల వల్ల మొత్తం 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు.
వరద బాధితులకు ఆర్థికసాయం పంపిణీపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. 11 వేల వాహనాల క్లెయిమ్‌లు వచ్చాయని, ఇప్పటికీ 6 వేల 500 క్లెయిమ్‌లు పరిష్కరించామని అధికారులు సీఎంకు తెలిపారు. 5 వేలకు పైగా గృహోపకరణాల మరమ్మతులకు ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 30 తేదీ లోగా ముంపు ప్రాంతాల్లో క్లెయిమ్‌లు పరిష్కరించాలని సూచించారు.