ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం - ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిపై మరో కేసు - case on ap mining director
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 4:29 PM IST
Case on YSRCP Leader for Cheating: వైఎస్సార్ జిల్లా వైసీపీ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ లింగారెడ్డి వీర ప్రతాప్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయింది. గనుల్లో వాటాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యవహారంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనవరిలో కేసు నమోదు అయింది. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ లక్షల్లో వసూళ్లకు పాల్పడి మోసగించారన్న ఫిర్యాదుతో వైఎస్సార్ జిల్లా గంగిరెడ్డి పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితుడు కమలాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపట్టాలని జడ్జి ఆదేశించడంతో పోలీసులు ఈనెల 27న కేసు నమోదు చేశారు. లింగారెడ్డి వీర ప్రతాప్ రెడ్డి కడప కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన దగ్గర 15 లక్షల తీసుకొని మోసం చేశారని రామాంజనేయులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం గురించి మాట్లాడతానని 2023 అక్టోబర్ 20న తనను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయానికి తీసుకువెళ్లి మీ పని అయిపోయిందని, ఉద్యోగం కోసం ఉత్తర్వులు త్వరలో జారీ అవుతాయని నమ్మించారని రామాంజనేయులు తెలిపారు. దఫదఫాలుగా మొత్తం 15 లక్షలు తీసుకొని మోసగించారని కొవ్వూరు రామాంజనేయులు ఫిర్యాదులో పేర్కొన్నారు.