రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆందోళన - పోలీసుల లాఠీఛార్జ్ - BJYM leaders protest in Hyderabad - BJYM LEADERS PROTEST IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 5:07 PM IST
BJYM Leaders protest In Hyderabad : పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చేపట్టిన శవయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన మోర్చా నాయకులను భారీ గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు గేట్లను తోసుకుని రోడ్డుపైకి రావడంతో వారిని చెదరగొట్టిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులకు, మోర్చా నాయకులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విభజనను, హింసను ప్రోత్సహిస్తున్నందున అధికార పార్టీ సభ్యులు హిందువులు కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడటాన్ని బీజేవైఎం నాయకులు ఖండించారు. రాహుల్ ప్రకటనను తప్పుబట్టారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.