దేశ సమగ్రత కోసం ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలి : పురందేశ్వరి - Purandeswari Flag Hoisting
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 1:57 PM IST
Purandeswari Flag Hoisting in Vijayawada : విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత కోసం సరిహద్దు దేశాల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పురందేశ్వరి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
దేశం కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం తీసుకొచ్చారని పురందేశ్వరి గుర్తు చేశారు. ఆనాడు 40 కోట్ల మంది ప్రజలంతా ఐకమత్యంతో కదిలారని చెప్పారు. ఇప్పుడు 144 కోట్ల మంది ప్రజలంతా దేశం సాధిస్తున్న ప్రగతి నిరోధానికి ఇతర దేశాలు చేస్తోన్న కుట్రల విచ్ఛినం దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాజా పరిణామాలను ప్రస్తావించారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం కూడా ప్రగతి దశలో పయనించాలని వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం సమష్టిగా కృషి చేద్దామని పురందేశ్వరి వెల్లడించారు.
ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు భారతీయ జనతా పార్టీ వారధి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లాంఛనంగా వారధి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును కంప్యూటీకరించింది- వాటిని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేందుకు తమవంతుగా ప్రయత్నాలు చేసేందుకు ఈ వారధికి శ్రీకారం చుట్టినట్లు పురందేశ్వరి తెలిపారు. భాజపా నుంచి గెలుపొందిన ప్రతి ప్రజాప్రతినిధి వారధిలో భాగస్వాములు అవుతారన్నారు.