తిరుమలలో బాలుడిని అపహరించిన మహిళ- 3గంటల్లో పట్టుకున్న పోలీసులు - Baby Missing Chase Tirupati Police
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 10:28 AM IST
Baby Missing Case Chase The Tirupati Police: తిరుమలలో బాలుడి అపహరణ కేసు సుఖాంతమయ్యింది. మాధవం యాత్రికుల సముదాయంలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన 3 గంటల వ్యవధిలోనే బాలుడి అచూకీని పోలీసులు కనిపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్‌కు చెందిన నగేష్, పరిమళ దంపతులు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారన్నారు. అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి చేరుకుని అద్దె గదుల కోసం కౌంటర్ల వద్దకు వెళ్లగా మాధవం కాంప్లెక్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహిళలు నిద్రిస్తున్న విషయాన్ని గమనించి నిందితురాలు బాధితుల చిన్న కుమారుడు అభినవ్‌కు సెల్‌ఫోన్ ఇచ్చి అపహరించిందన్నారు.
అనంతరం తిరుమలలో ట్యాక్సీ ఎక్కి తిరుపతి కెన్సెస్ హోటల్ ముందు దిగి అక్కడి నుంచి తూర్పు పోలీస్‌స్టేషన్ ముందు నడుచుకుంటూ పెద్దకాపు వీధికి చేరినట్లు తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘం నేత ఆవుల ప్రభాకర్‌యాదవ్ వద్దకు వెళ్లి ఆమె తక్కువ ధరకు గది దొరికే లాడ్జి ఎక్కడుందని అడిగిందన్నారు. అటువైపు వెళ్లమని చెబుతూ ఆర్టీసీ వాట్సాప్ గ్రూపులో వచ్చిన మహిళ ఫొటో సరిచూసుకున్న ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అప్పటికే మహిళ సమీపంలోని ఓ లాడ్జిలో గది తీసుకుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఉన్న తల్లిదండ్రులను పిలిపించి 3 సంవత్సరాల అభినయ్‌ను పోలీసులు వారికి అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ రాజమండ్రి వాసిగా పోలీసులు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.