శిలాఫలకంపై జగన్ పేరు ఉండాలనే మెడికల్ కాలేజీ ప్రారంభం: బీటెక్ రవి
🎬 Watch Now: Feature Video
B Tech Ravi Sensational Comments On CM Jagan: ఇంకా పనులు పూర్తి కాని మెడికల్ కాలేజీని నిన్న సీఎం జగన్ ఆగమేఘాల మీద ప్రారంభించారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీకి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్నా, తొందరపాటుగా మెడికల్ కాలేజీ ప్రారంభిచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని బీటెక్ రవి ఎద్దేవా చేశారు. శిలాఫలకంపై తన పేరు ఉండాలనే సీఎం జగన్ మెడికల్ కాలేజీని ప్రారంభించారని విమర్శించారు.
ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న వర్గాలను మచ్చిక చేసుకోవడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. అందుకే పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద గ్రావెల్ పనులు ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఆయా నేతలు ఉపాధి హామీ పనులను జేసీబీలతో జరిపించారని బీటెక్ రవి ఆరోపించారు. వాటికి బిల్లులు వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. బుధవారం పులివెందులలో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్నికల్లో గెలవడానికి అందరినీ కలుపుకుపోతామని పేర్కొన్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.