ప్రధాని వ్యాఖ్యలు ఖండించిన షర్మిల- వైసీపీతో తెరచాటు స్నేహం నడిపింది ఎవరంటూ నిలదీత - Sharmila on PM Modi Comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 9:59 AM IST
APCC Chief Sharmila on PM Modi Comments: ముఖ్యమంత్రి జగన్‌తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్, వైసీపీ ఒకటేనని ప్రధాని మోదీ(PM Modi) ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా? అని ఆమె ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు. ఏపీని నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. దత్త పుత్రుడు అన్నది ఎవరినో అని నిలదీశారు.
పార్లమెంటులో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు జగన్(CM Jagan) ప్రభుత్వం(YSRCP Govt) మద్దతు ఇవ్వలేదా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని షర్మిల గుర్తు చేశారు. వాటిని తుంగలో తొక్కింది బీజేపీ(BJP), టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) అని మండిపడ్డారు. ఇప్పుడు ఆ మోసాలను కప్పి పెట్టాలని కాంగ్రెస్ మీద పసలేని దాడులు చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే అనే కాంగ్రెస్ వాగ్దానం మోదీకి వణుకు తెప్పిస్తోందా అని ఎద్దేవా చేశారు. పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించి ఇప్పుడు కాంగ్రెస్‌పై దాడులా అని షర్మిల మండిపడ్డారు.