ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టు విచారణ- వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు - AP Latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 10:52 AM IST
AP High Court on Ongole House Pattas: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల పట్టాలు పొందిన వారికి మళ్లీ పట్టాలు ఇవ్వబోతున్నారంటూ సామాజిక కార్యకర్త రాంబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మళ్లీ పట్టాలు పొందిన వారి వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌కు ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
పేదలందరికి ఇళ్లు పథకం(Pedalandarikiillu Scheme) కింద 22వేల 620 మందికి పట్టాలు జారీచేసేందుకు రూ.210 కోట్లు మంజూరు చేస్తూ జారీచేసిన జీవోని పిటిషనర్ సవాలు చేశారు. 7వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రాజకీయ కారణాలతో ఇచ్చిన వారికే మళ్లీ పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.210 కోట్ల మంజూరులో 30 కోట్ల రూపాయలు ఖర్చుచేశారన్నారు. మిగిలిన సొమ్ము విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాను బయటపెట్టకుండా గోప్యత పాటిస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందినవారికి మళ్లీ పట్టాలు జారీచేయడంపై అధికారులను వివరణ కోరతామని తెలిపింది.