అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి - లేదంటే వైఎస్సార్సీపీ ఓటమికి కృషి చేస్తాం : ముప్పాళ్ల నాగేశ్వరరావు - ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రెస్ మీట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 10:04 PM IST
Agrigold Victims are Angry With CM Jagan : అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటతప్పారని అగ్రిగోల్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నాడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితుల దీక్షా శిభిరం వద్దకు వచ్చి, తాను ఏర్పాటు చేసేది మనసున్న ప్రభుత్వమని, మీ తమ్ముడిగా, కుటుంబ సభ్యునిగా ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితునికి పూర్తి న్యాయం చేస్తానన్నారని తెలిపారు. అదే విధంగా మరణించిన బాధితులకు చంద్రబాబు ప్రకటించిన రూ.3 లక్షల ఏక్స్ గ్రేషియాకు బదులు రూ.10 లక్షలు పూలలో పెట్టి ఇంటికి పంపుతానని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు ఏమయ్యాయని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
బాధితులు ప్రభుత్వ సొమ్ము అడగడం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నామని అన్నారు. బాధితులను ఆదుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్సార్సీపీ ఓటమికి కృషి చేస్తారని హెచ్చరించారు.