తిరుపతి జట్టుపై ప్రత్యర్థి జట్ల ఫిర్యాదు- అధికారుల ఏకపక్ష వైఖరిపై క్రీడాకారుల ఆగ్రహం - విశాఖలో ఆడుదాం ఆంధ్రా పోటీలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 1:22 PM IST
Adudham Andhra Competitions in Controversy: విశాఖలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 'ఆడుదాం-ఆంధ్రా' తుది పోటీల్లో వివాదం చెలరేగింది. పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో(PM Palem Cricket Stadium) తిరుపతి జట్టులో ఇతర జిల్లాల క్రీడాకారులు ఉన్నారని తూర్పు గోదావరి జట్టు ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం తుది జట్టులోని ఆటగాళ్లు ఒకే సచివాలయం పరిధిలోని వారై ఉండాలి. కానీ, ఇతర ప్రాంతాలకు చెందిన వారితో ఆడించారంటూ ప్రత్యర్థి జట్టు సభ్యులు ఆరోపించారు. నిబంధనలు పక్కన పెట్టి అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని బాధిత జట్లు మండిపడుతున్నాయి.
తిరుపతి జట్టుపై ఇప్పటి వరకు మూడు జిల్లాల జట్లు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇచ్చిన ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని ప్రకాశం జట్టు పట్టు పట్టడంతో అధికారులు తల పట్టుకున్నారు. ఆదివారం ప్రకాశం, తిరుపతి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాన్ని ఇంత వరకు ప్రకటించలేదు. తిరుపతి జట్టుపై అధికారులు నిషేధం (Disqualify) విధించడంతో ఆ టీం సభ్యులు నిరసన చేపట్టారు. గత శుక్రవారం రాత్రి జరిగిన తిరుపతి, నెల్లూరు జిల్లా బాలికల జట్ల మధ్య మ్యాచ్లో కూడా వివాదం చోటుచేసుకుంది. అందులో సచివాలయ పరిధిలోని క్రీడాకారిణులు ముగ్గురే కాగా మిగిలిన వారంతా పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని రాష్ట్ర స్థాయి ఆటగాళ్లు ఉన్నారని కసుమూరు జట్టు బాలికలు ఆరోపించారు. దీనిపై కసుమూరు జట్టు కోచ్ మల్లికార్జునరెడ్డి, బాలికలు శాప్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.