Lock Down Mode Android : ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ యూజర్లపై సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా, ఫైల్స్, బ్యాంకు అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పటిష్ఠమైన భద్రతా ఫీచర్ ఒకటి ఉంది. అదే ఆండ్రాయిడ్ లాక్డౌన్ మోడ్. ఈ ఫీచర్ సైబర్ దాడుల నుంచి యూజర్ల డేటాకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాధారణంగా పిన్ నంబర్, పాస్ వర్డ్, ప్యాటర్న్ తెలియకపోతే ఎవరూ మీ ఫోన్‌ను ఉపయోగించలేరు. అలాగే అందులోని డేటాను చోరీ చేయలేరు. కానీ ఈ లాక్డౌన్ మోడ్‌ను ఆన్ చేస్తే ఆ వివరాలన్నీ తెలిసినా ఫోన్ ఓపెన్ చేయలేరు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయగానే వెంటనే బయోమెట్రిక్ అన్‌లాక్ విధానాలను అన్ని ఆటోమెటిక్ ఆఫ్ అయ్యి మీ ఫోన్ సురక్షితంగా ఉంటుంది. అందుకే మీ ఫోన్లోని డేటాను మరింత భద్రంగా ఉంచుకునేందుకు లాక్డౌన్ మోడ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? అది ఎలా పనిచేస్తుంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అందరూ ఫోన్‌కు పిన్, పాస్ వర్డ్, ప్యాటర్న్‌ను పెట్టుకుంటారు. వాటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తారు. మీ ఫోన్‌ను ఇతరులెవరైనా దొంగిలించినా వీటి గురించి తెలియకపోతే అన్‌లాక్ చేయలేరు. ఇంకొందరు ఫోన్ సెన్సార్‌పై బయోమెట్రిక్, కెమెరాపై ఫేస్ రికగ్నజిషన్ ద్వారా ఫోన్‌ను మరింత వేగంగా అన్ లాక్ చేసుకుంటుంటారు. అయితే ఫోన్‌ను దొంగిలించాలనుకున్నవారు మీ ఫింగర్ ప్రింట్, పేస్ రికగ్నైజేషన్ ద్వారా అందులోని డేటాను చోరీ చేయవచ్చు. కానీ, లాక్డౌన్ మోడ్ నాలెడ్జ్ బేస్డ్ అథెంటికేషన్‌తో(KBA) వస్తుండడం వల్ల ఫోన్లోని డేటా చోరీ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ లాక్డౌన్ మోడ్ మీ ఫోన్ లాక్ స్క్రీన్‌పై నోటిఫికేషన్లను సైతం హైడ్ చేస్తుంది. తద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లోని టెక్ట్స్ మెసేజ్, ఇతర వ్యక్తిగత డేటాను చూడలేరు. లాక్డౌన్ మోడ్ వల్ల సైబర్ కేటుగాళ్లు వాయిస్ రికగ్నైజేషన్ ద్వారా కూడా మీ మొబైల్లోని డేటాను కొల్లగొట్టలేరు.
ఈజీగా డియాక్టివేట్ చేసుకోవచ్చు
ఎవరైనా మీ బయోమెట్రిక్‌ను తెలుసుకున్నారని మీరు భావిస్తే వెంటనే లాక్డౌన్ మోడ్‌ను ఎనేబుల్ చేయండి. అలాగే మీ ఫోన్ చోరీకి గురైనప్పుడు మీ వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండడానికి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. అప్పుడు దొంగ వెంటనే మీ ఫోన్‌ను అన్ లాక్ చేయలేడు. అంతలోగా మీరు ఫోన్ IMEIను బ్లాక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ మోడ్‌ను కొన్ని నిర్దిష్ట పరిస్థితుల కోసం తీసుకొచ్చారు. ఇది యాక్టివేట్ చేసిన తర్వాత ఫోన్‌ను అన్‌లాక్ చేస్తే లాక్డౌన్ మోడ్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. బయోమెట్రిక్ ఆథంటికేషన్ యాక్టివ్ అవుతుంది. మీరు మళ్లీ లాక్డౌన్ మోడ్‌ను పెట్టుకోవాలంటే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ మెనూ లేదా పవర్ ఆప్షన్ ద్వారా లాక్డౌన్ మోడ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. అలాగే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఫోన్ మోడల్, ఆండ్రాయిడ్ వెర్షన్ ఆధారంగా లాక్ డౌన్ మోడ్ పనిచేస్తుంది. అయితే, కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో లాక్డౌన్ మోడ్ ఫీచర్ పనిచేయదు.
అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదు!
ఆండ్రాయిడ్ లాక్డౌన్ మోడ్ మీ ఫోన్‌కు మరింత భద్రతను ఇస్తుంది. ఈజీగా ఈ ఫీచర్‌ను ఫోన్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసినా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఫోన్ లాక్డౌన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు కాల్ చేసినా లిఫ్ట్ చేయవచ్చు. ఫ్లాష్ లైట్, కెమెరా వంటి లాక్ స్క్రీన్ షార్ట్ కట్స్‌ను వాడొచ్చు. రియల్ మీ, ఒప్పో వంటి ఫోన్లలో ఈ ఫీచర్ పనిచెయ్యకపోవచ్చు.