Vida V2 Series Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ సబ్సిడరీ విడా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'Vida V2' సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 'V2 Lite', 'V2 Plus', 'V2 Pro' అనే మూడు వేరియంట్‌లు ఉన్నాయి.
'విడా వీ2' అనేది కంపెనీ 'విడా వీ1' శ్రేణికి కొత్త వెర్షన్. దీనితో హీరో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఇక కంపెనీ తీసుకొచ్చిన 'విడా వీ2' సిరీస్‌లోని 'విడా వీ2 లైట్' అత్యంత సరసమైన, సరికొత్త వేరియంట్. ఈ బేస్ వేరియంట్ 2.2kWh చిన్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని IDC రేంజ్ 94 km అని కంపెనీ పేర్కొంది.
'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' వేరియంట్‌లతో పోలిస్తే దీని టాప్ స్పీడ్ చాలా తక్కువగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 69 కిలోమీటర్లు. అదే సమయంలో 'వీ2 ప్లస్' టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇక 'వీ2 ప్రో' టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.
అంతేకాక 'వీ2 లైట్'లో 'Ride', 'Eco' అనే రెండు రైడింగ్ మోడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర ఫీచర్లు 'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' వేరియంట్‌ల మాదిరిగానే 'వీ2 లైట్'లో ఉన్నాయి.
కంపెనీ ఈ 'విడా వీ2' సిరీస్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేను ఇచ్చింది. ఈ సిరీస్‌లోని 'విడా వీ2 లైట్' అత్యంత సరసమైన ధరలో రూ. 96,000 (ఎక్స్-షోరూమ్, దిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ కెపాసిటీ పరంగా ఇది 'TVS iQube 2.2', 'Bajaj Chetak 2903' మోడళ్లతో సమానంగా ఉండటం విశేషం.
మరోవైపు విడా 'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' లో మార్పులను గుర్తించడం కష్టం. ముఖ్యంగా ఈ వెర్షన్లు 'విడా వీ1' మోడల్‌ను పోలి ఉంటాయి. అయితే పూర్తిగా 'వీ1' మాదిరిగా అయితే మాత్రం ఉండవు. 'వీ2 ప్లస్' రూ. 1.15 లక్షల ధరతో, 3.44kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 85kph వేగంతో, 143km IDC రేంజ్‌తో వస్తుంది.
ఇక 'విడా వీ2' లైనప్‌లోని రేంజ్-టాపర్ 'వీ2 ప్రో' ధర రూ. 1.35 లక్షలు. ఇది 3.94kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్ 165కి.మీల IDC రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇ-స్కూటర్ 5 సంవత్సరాలు/50,000 కిమీ వారంటీతో వస్తుంది. అయితే బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాలు/30,000 కిమీ వారంటీతో వస్తుంది.
ధర:
'వీ2 లైట్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ. 96,000 (ఎక్స్-షోరూమ్, దిల్లీ)
'వీ2 ప్లస్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ)
'వీ2 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ)
2025 హోండా అమేజ్ ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇది డిజైర్ కంటే మెరుగ్గా ఉందా..?
ప్రోబా-3 మిషన్ సక్సెస్- నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59
పోకో పవర్ఫుల్ 5G ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. అది కూడా ప్రీమియం ఫీచర్లతో అత్యంత చౌకగా..!