The First Youtube Video : ప్రపంచంలోని వీడియో ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో, యూట్యూబ్‌కు ఉన్నంత క్రేజ్ మరిదేనికీ లేదంటే, అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిన్న విషయం నుంచి బుర్రకు అర్థంకాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు అడ్డా 'యూట్యూబ్'. అంతేకాకుండా తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు, చాలా మంది క్రియేటర్లు యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే యూట్యూబ్‌లో తొలి వీడియోను ఎవరు? ఎక్కడ? ఎప్పుడు అప్లోడ్ చేశారు? దానికి ఇప్పటి వరకు ఎంత రెవెన్యూ వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ వీడియో ఇదే!
యూట్యూబ్‌లో మొదటి వీడియోను ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ 2005 ఏప్రిల్ 24న అప్లోడ్ చేశారు. అమెరికాలోని సాన్ డియాగో జూలో 'మీ ఎట్ ది జూ' పేరుతో ఏనుగుల ఎదురుగా నిలబడిన వీడియోను యూట్యాబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన ఏనుగుల గురించి సరదాగా ప్రేక్షకులకు చెప్పారు. ఈ వీడియో నిడివి 19 సెకన్లు మాత్రమే. 19 ఏళ్ల క్రితం అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 322 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. అలాగే ఈ వీడియోను అప్లోడ్ చేసిన జావెద్ కరీమ్ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రస్తుతం 4.72 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే జావెద్ కరీమ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో ఇదే కావడం గమనార్హం.
రెవెన్యూ ఎంత వచ్చింది?
జావెద్ కరీమ్ అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ఇంతలా వ్యూస్ రావడం వల్ల భారీగా డబ్బులు వచ్చాయని మీరు అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసేనాటికి యూట్యూబ్ మానిటైజేషన్ ప్రారంభించలేదు. కనుక ఆ ఫస్ట్ వీడియోపై రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. వాస్తవానికి ఈ వీడియోకు డబ్బులు ఇచ్చారా? లేదా? అనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
గూగుల్ కంపెనీ యూట్యూబ్‌ను కొనుగోలు చేసినప్పుడు, జావెద్ కరీమ్‌కు ఈక్విటీ రూపంలో 1,37,443 షేర్లను అందించింది. వీటిలోని కొన్ని షేర్లను 2006లోనే కరీమ్ అమ్మేశారు. ఇంకా ఆయన దగ్గర మిగిలిన ఉన్న షేర్ల విలువ ప్రస్తుతానికి సుమారుగా 390 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
యూట్యూబ్ ప్రస్థానం
ప్రముఖ వీడియో ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను చాడ్ హుర్లీ, స్టీవెన్ చిన్, జావెద్ కరీమ్ 2005 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. వీళ్లు ముగ్గురు పేపాల్ మాజీ ఉద్యోగులు. ఆ తర్వాత యూట్యూబ్‌ను 2006లో గూగుల్ కొనుగోలు చేసింది. ప్రస్తుత కాలంలో యూట్యూబ్ మంచి ప్రజాదరణ పొందుతోంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ యూట్యూబ్‌ను వినియోగిస్తున్నారు.
మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike