Cars Price Hike 2025 in India: మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈసారి కూడా దేశీయ లగ్జరీ కార్ల బ్రాండ్ సంస్థలు తమ శ్రేణిలోని వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియో ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్‌పుట్ వ్యయం, కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కో కంపెనీ ఒక్కో కారణాన్ని చెప్పుకొస్తున్నాయి. 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ సవరించిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏ కంపెనీలు ఏ మోడల్ కార్లపై ఎంత ధరలను పెంచుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Hyundai Motor India: ప్రముఖ కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ తన అన్ని కార్ల ధరలను రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో వెన్యూ, క్రెటా, ఎక్స్‌టర్ వంటి SUVలతో పాటు హ్యుందాయ్ ఆరా సెడాన్, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి హ్యాచ్‌బ్యాక్‌లను కూడా విక్రయిస్తోంది. వీటితో పాటు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 'Ioniq 5 EV' కూడా ఉంది.
Nissan India: జపనీస్ కార్ల తయారీదారు నిస్సాన్ ఇటీవల భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ దాని ధరను 2 శాతం పెంచబోతోంది. ఇది కంపెనీ ఏకైక మేడ్-ఇన్-ఇండియా SUV. కంపెనీ దీన్ని దేశీయంగా విక్రయించడంతో పాటు విదేశాలకూ ఎగుమది చేస్తోంది.
Audi India: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా తన కార్లు, SUVల ధరలను జనవరి 1, 2025 నుంచి 3 శాతం పెంచబోతోంది. కంపెనీ ఆడి A4, A6 సెడాన్‌లతో పాటు ఆడి Q3, Q3 స్పోర్ట్‌బ్యాక్, Q5, Q7 SUVలను భారతదేశంలో స్థానికంగా అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తోంది. అసెంబ్లింగ్ అంటే వీటి ముఖ్య విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ దేశీయంగా ఈ మోడల్ కార్లను రూపొందిస్తుంది.
ఇవి కాకుండా కంపెనీ A5 స్పోర్ట్‌బ్యాక్, Q8 SUV, దాని ఎలక్ట్రిక్ డెరివేటివ్‌లు, e-Tron GT, RS e-Tron GT వంటి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయిస్తోంది.
BMW India: కొత్త సంవత్సరం నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచబోతున్న కంపెనీల లిస్ట్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా పేరు కూడా ఉంది. కంపెనీ స్థానికంగా BMW '2 సిరీస్ గ్రాన్ కూపే', '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్', 'M340i', '5 సిరీస్ LWB', '7 సిరీస్' సెడాన్ కార్లతో పాటు 'X1', 'X3', 'X5', 'X7' SUVలను భారతదేశంలో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తోంది.
ఇవి కాకుండా BMW 'i4', 'i5', 'i7' ఎలక్ట్రిక్ కార్లు, 'iX1', 'iX' ఎలక్ట్రిక్ SUVలు, 'Z4', 'M2 కూపే', 'M4 కాంపిటీషన్', 'CS', 'M8', 'XM'తో పాటు ఇటీవల విడుదల చేసిన BMW M5 వంటి దిగుమతి చేసుకున్న కార్ల అమ్మకాలను జరుపుతోంది.
Mercedes Benz India: ఈ ఏడాది చివర్లో ధరల పెంపును ప్రకటించిన మొదటి కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్. జనవరి 1వ తేదీ నుంచి ఈ కంపెనీ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచబోతోంది. GLC ధరలను రూ. 2 లక్షలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఉత్పత్తుల్లో 'Mercedes-Maybach S680 V12' ధర గరిష్ఠంగా రూ. 9 లక్షలు భారీగా పెరగనుంది.
అయితే ఈ తేదీకి ముందు బుక్ చేసిన యూనిట్లతో సహా డిసెంబర్ 31, 2024 వరకు తయారు చేసిన మోడల్‌లకు ఈ ధరల పెరుగుదల ఉండదు. దీంతో మెర్సిడెస్ నుంచి లగ్జరీ బెంజ్ కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వెంటనే ఈ నెలాఖరు లోగా వీటిని బుక్ చేసుకుంటే వారికి ఈ పెరిగిన ధరలు వర్తించవు.
Maruti Suzuki: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కూడా వాహన ధరలను పెంచుతున్నట్లు తన ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ సవరించిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పెంపు కారు మోడల్, వేరియంట్ ఆధారంగా అత్యధికంగా 4శాతం వరకు ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.
వ్యయ నియంత్రణకు చర్యలు చేపట్టి కస్టమర్లపై అదనపు భారం పడకుండా చూసేందుకే కంపెనీ ప్రయత్నిస్తోందని, కానీ కొన్ని విభాగాల్లో ధరల పెరుగుదలను వినియోగదారులకు బదలాయించక తప్పడం లేదని మారుతీ సుజుకీ తన ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.
Mahindra & Mahindra: మహీంద్రా కంపెనీ కూడా తన స్కార్పియో ఎన్ మోడల్ ధరలను పెంచింది. ఈ మోడల్లో వేరియంట్లను బట్టి రూ.25 వేల వరకు ధరలను సవరించింది. దీంతోపాటు ఎక్స్‌యూవీ 300 రేట్లను సైతం పెంచింది.
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై గ్రూప్ చాట్‌లో నో కన్ఫ్యూజన్!
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ వచ్చేసింది- ఆ ఫోన్స్, టాబ్లెట్స్, వాచ్, ఇయర్‌బడ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు..!
165KM రేంజ్‌తో 'విడా వీ2' ఎలక్ట్రిక్ స్కూటర్లు- కేవలం రూ.96వేలకే..!