NASA Mars Mission Ingenuity : అంగారకుడిపై పరిశోధనలు చేసిన ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇకపై ఎగరలేదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. 1800 గ్రాముల బరువున్న ఈ చిన్న హెలికాప్టర్‌లోని రోటర్ బ్లేడ్లు విరిగిపోయినట్లు గుర్తించామని పేర్కొంది. ఈ గ్రహాంతర హెలికాప్టర్ నుంచి నాసాకు ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయనీ అయితే 85 మిలియన్ డాలర్ల ఈ మిషన్ ముగిసిపోయినట్లేనని స్పష్టం చేసింది.
అరుణ గ్రహ గురుత్వాకర్షణ, పీడనాల వద్ద హెలికాప్టర్ ఎగరడం సాధ్యపడుతుందా లేదా అని తెలుసుకునేందుకు నాసా ఇంజెన్యూటీని 2021లో పర్సువరెన్స్ రోవర్ మిషన్‌లో భాగంగా ప్రయోగించింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది. మన సౌర వ్యవస్థలో ఎగరడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసింది.
తాత్కాలికంగానే పనిచేసేలా ఇంజెన్యూటీని రూపొందించారు. గత 3 ఏళ్లుగా అనుకున్న దానికన్నా మెరుగ్గా ఇది పనిచేసింది. 72 సార్లు మార్స్ వాతావరణంలో ఎగిరింది. మార్స్ మీద 18 కిలోమీటర్లు ప్రయాణించింది. అంగారకుడిపై 79 అడుగుల ఎత్తులో గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఎగిరింది. తొలుత పర్సువరెన్స్ రోవర్‌తో అనుసంధానించడం వల్ల ఇది పనిచేసింది. చివరిసారి ఇది ఎగిరినప్పుడు 40 అడుగుల ఎత్తుకు చేరింది. మార్స్ ఉపరితలానికి 3 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోవర్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. కాగా అంగారకుడిపై ఇంజెన్యూటీ విజయవంతంగా ఎగరడం వల్ల మరో రెండు హెలికాప్టర్లను నాసా 2022లో ప్రయోగించింది.
ల్యాండర్ ప్రయోగం విఫలం
US Moon Landing 2024 : అమెరికా నుంచి దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ఒక ల్యాండర్ పంపాలని చేసిన ప్రయోగం ఇంధనం లీకేజీ కారణంగా ఇటీవలే విఫలమైంది. పెరిగ్రిన్ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ప్రకటించింది. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినప్పటికీ ప్రొపెల్లెంట్ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరి చేయలేకపోయామని వెల్లడించింది. దీంతో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవకాశం లేదని సంస్థ తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.