Mahindra BE 6e Renamed: స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా ఇటీవల సరికొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేసింది. ఈ కార్లతోనే కంపెనీ తొలిసారిగా ఈవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఇక తన మొదటి ఈ విద్యుత్ వాహనాలను మహింద్రా 'XEV 9e', మహింద్రా 'BE 6e' పేర్లతో తీసుకొచ్చింది. అయితే కంపెనీ వీటిలో 'మహింద్రా BE 6e' పేరును మార్చింది. ఈ పేరులో 'e' ని తొలగించి 'BE 6'గా మార్పుచేసింది. అయితే కంపెనీ ఈ పేరును ఎందుకు మార్చింది? దీని వెనక అసలు కారణం ఏంటి? వంటి వివరాలు మీకోసం.
కారణం ఇదే!: మహింద్రా ఇటీవల లాంఛ్ చేసిన 'BE 6e' ఎలక్ట్రిక్ SUV పేరుపై దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎయిర్ లైన్స్ '6E' కోడ్‌ను ఉపయోగించి ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ మహింద్రాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో దీనిపై మహింద్రా తాజా ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో రెండు మల్టీనేషనల్ కంపెనీలు ఇలాంటి అనవరసరమైన వివాదంలో పాల్గొనడం అనాలోచితమని, ఈ నేపథ్యంలో తమ 'BE 6e' ఎలక్ట్రిక్ పేరును 'BE 6'గా మార్చుతున్నట్లు ప్రకటించింది.
'కోర్టులో పోరాటం కొనసాగిస్తాం': మహింద్రా ప్రస్తుతానికి తన 'BE 6e' ఎలక్ట్రిక్ పేరును మార్చినప్పటికీ కోర్టులో పోరాటం కొనసాగిస్తామని పేర్కొంది. ఈ 'BE 6e' ట్రేడ్‌మార్క్ కోసం ఇప్పటికే క్లాస్ 12 సెక్షన్ కింద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ '6e' పేరును నమోదు చేసిన విభాగానికి భిన్నంగా ఉందని తెలిపింది. అయితే మహింద్రా ట్రేడ్‌మార్క్ 'BE 6e' అనేది స్టాండలోన్ కాదు. '6E' ట్రేడ్‌మార్క్ అనేది ఇండిగో విమానాల కోసం ఉపయోగించే కోడ్.
అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఇంటర్‌గ్లోబ్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ తమ మార్క్ భిన్నంగా ఉన్నప్పటికీ తమపై కేసు నమోదు చేసినట్లు మహింద్రా పేర్కొంది. ఈ క్రమంలో గతంలో 2005లో టాటా మోటార్స్.. ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో నేమ్‌ప్లేట్‌ను ఉపయోగించిందని గుర్తుచేసింది. ఆ సమయంలో టాటా మోటార్స్ ఇండిగో సెడాన్ అమ్మకానికి కూడా అందుబాటులో ఉందని పేర్కొంది.
ఈ క్రమంలో 'BE 6e' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కును పొందేందుకు కోర్టులో కేసుపై పోరాడుతూనే ఉంటామని మహింద్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో మహీంద్రా, ఇంటర్‌గ్లోబ్ మధ్య వివాదం పరిష్కారమయ్యే వరకు ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV 'BE 6' పేరుతోనే విక్రయానికి అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
మార్కెట్లోకి మరో లగ్జరీ ఈవీ.. సింగిల్ ఛార్జ్‌తో 473కి.మీ రేంజ్..!
మీరు మర్చిపోయినా వాట్సాప్ మర్చిపోదుగా.. ఈ ఫీచర్ ద్వారా మీకు గుర్తుచేస్తూనే ఉంటుంది!
స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్.. బజాజ్ న్యూ చేతక్ ఈవీ వచ్చేస్తోందోచ్..!