Zilledupeta People Facing Difficulties Due to Bridge Facilities : పిల్లలు బడికి వెళ్లాలన్నా, ఇంట్లోకి నిత్వావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా, రోగులు, వృద్ధులు ఆసుపత్రికి వెళ్లాలంటే ఆ గ్రామ ప్రజలకు నాటుపడవే దిక్కు. దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఊరికి వంతెన నిర్మించడంలో పాలక వర్గం నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. మా ఊరికి బ్రిడ్జి కావాలంటూ గ్రామస్థులు నాయకులు అడిగితే నోటి మాటల హామీలు, శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేస్తున్నారు.
Srikakulam District : శ్రీకాకుళం జిల్లా జిల్లేడుపేట గ్రామానికి రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లేడుపేట గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే మహేంద్ర తనయ నది దాటాల్సిందే. గ్రామానికి వంతెన లేని కారణంగా నాటు పడవ ఆధారంగానే పక్క గ్రామాలకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో వంతెన నిర్మిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చి అయిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి నెరవేర్చలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. కేవలం శిలాఫలకల శంకుస్థాపన చేశారు. కానీ వంతెన నిర్మాణ పనులు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వంతెనకు రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసినా సకాలంలో టెండర్లు పూర్తి కాకపోవడంతో గ్రామస్థులు వంతెనపై ఆశలు వదిలేసుకున్నారు.
ఆ రోడ్డంటే.. హాహాకారాలే.. 18 కి.మీ లు.. రూ.13 కోట్లు.. 20 నెలలు.. 2 కి మీ
జిల్లేడుపేట గ్రామం నలువైపులా నీరు ఉండటం వల్ల ఎటువెళ్లినా నాటుపడవ ఉపయోగించాల్సిందేనని గ్రామస్థులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షంకే గ్రామంలోకి వెళ్లాలన్నా, రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బడికి పంపించాలన్నా మహేంద్ర తనయ నదిని దాటాలని పేర్కొన్నారు. దీంతో పిల్లలను పట్టణంలో చదివిస్తున్నామని పేర్కొన్నారు. 108 అంబులెన్స్, పౌరసరఫరాలు, అంగన్వాడీ సరుకులు లాంటివి నాటుపడవలో వెళ్లి తీసుకోవాల్సి న పరిస్థితి ఉందని తెలియజేశారు.
గుంతల రోడ్డుకు ప్రారంభోత్సవం - నవ్వుకుంటున్న జనం
గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నాం. నిల్వ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామానికి వంతెన లేని కారణంగా అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు పట్టణానికి వలస వెళ్తున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాన్ని చూసి యువకులకు పెళ్లి జరగడం కూడా కష్టంగా ఉంది. -జిల్లేడుపేట గ్రామస్థులు
దశాబ్దాలుగా నాటు పడవలోనే ప్రయాణం సాగిస్తున్నా, మా గ్రామానికి వంతెన నిర్మించాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడికైనా తమ గ్రామ అవస్థలు గ్రహించి వంతెన నిర్మించాలని నాయకులు, అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.
'తవ్వి వదిలేశారు' నిధుల కొరతతో నిలిచిన రోడ్ల మరమ్మతు - నిత్యం నరకం చూస్తున్న ప్రయాణికులు