Varra Ravinder Reddy Remand : పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి కడప రెండో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వర్రాని పోలీసులు అర్ధరాత్రి రెండు గంటలు దాటాక జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను అతని తరఫు న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందు ఉంచిన అనంతరం వాదనలు వినిపించారు. ఉదయం 5 గంటల వరకు వాదనలు కొనసాగాయి.
వాదనలు విన్న మేజిస్ట్రేట్ రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అతనితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయ్‌రెడ్డి, సుబ్బారెడ్డికి 41-ఏ నోటీసులిచ్చి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని వర్రా రవీందర్‌రెడ్డి జడ్జికి తెలిపారు. వర్రా మాటలను మేజిస్ట్రేట్ రికార్డు చేసుకున్నారు. ఇవాళ ఉదయం కడప రిమ్స్‌లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను తనకు సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అనంతరం అతడిని రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. మరోవైపు పోలీసులు అన్యాయంగా వర్రాని కొట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని హింసించినట్లు ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు.