YSRCP MLC Anantha Babu Issue: వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదు. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే! అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్కయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఎమ్మెల్సీ అనంత బాబు, ఆ వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి పలుమార్లు 13.30 లక్షల రూపాయలు తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని పోలీసులు అడగడంతో, ఈ ఏడాది మే నుంచి జూన్ 24 వరకు ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు. బైరు వాసుగౌడు, కె.సంతోష్‌కుమార్, మరో ఇద్దరు మహిళల అకౌంట్ వివరాలు, ఫోన్‌పే నంబర్లను పోలీసులకు ఇచ్చారు.
మరి నిజంగా అది మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్‌మెయిల్ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకు దాచి పెట్టాలనుకున్నారు. అది నిజమైన వీడియో కాబట్టే, డబ్బులిచ్చి తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనుకుని అడ్డంగా బుక్కయిపోయారని స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అనంతబాబు అరాచకాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎంతోమంది మహిళలను బెదిరించినట్లు చెప్పారు.
ANANTHA BABU VIRAL VIDEO ISSUE: కాగా సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు ఓ వీడియో వైరల్ అయింది. అవతలి వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టడంతోపాటు జుగుప్సాకరంగా ప్రవర్తించినట్లుగా అందులో ఉంది. ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా అదంతా మార్ఫింగ్ వీడియో అని తెలిపారు. వీడియోకాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని కత్తిరించి, మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. తన వీడియోలను మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.