Irregularities in Swapnalok Layout Vizianagaram District : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లిలో 'SVN స్వప్న లోక్' పేరుతో వెలసిన లేఅవుట్ ఇది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు కౌషిక్ 160 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. మొదటి విడతగా 50 ఎకరాల్లో 167 నుంచి 500 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు వేశారు. 40 అడుగుల వెడల్పుతో జాతీయ రహదారి నుంచి లేఅవుట్ వరకూ రోడ్డు సైతం వేశారు. విశాఖ-అరకు మధ్య జాతీయ రహదారి ఏర్పాటుతో ఈ లేఅవుట్ లోని మొదటి విడత ప్లాట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఐతే ఈ లేఅవుట్‌లో ప్రభుత్వ భూములున్నాయి. హక్కుదారులను నయానో భయానో ఒప్పించి డి-పట్టా భూములను ఆక్రమించారు. పంట కాలువలను లేఅవుట్ లో కలిపేసుకున్నారు. గత వైఎస్సార్సీపీ సర్కారు అండతో ఏకంగా ప్రభుత్వ భూమి నుంచే లేఅవుట్ ప్రధాన రహదారి నిర్మించారు. ఇంత జరిగినా రెవెన్యూ, పంచాయతీ అధికారులు కనీసం అడ్డుకోలేదు.
'జగన్నాథ చెరువులోని 7సెంట్ల భూమిని లేఅవుట్‌లో కలిపేసుకున్నారు . చెరువు కింద ఉన్న పలువురు రైతులకు చెందిన డి-పట్టా భూములు దౌర్జన్యంగా ఆక్రమించారు. 100-1సర్వే నెంబర్ లో చీమల గంగమ్మకు చెందిన 50 సెంట్లు, వేమలి సీతమ్మకు చెందిన 50 సెంట్లు, 101-2సర్వే నెంబర్లో అచ్చాయమ్మకు చెందిన 80సెంట్లు చెరబట్టారు. నిబంధనల ప్రకారం డి-పట్టా భూములను లబ్ధిదారులు వంశపార్యం పరంగా సాగు చేసుకోవాలే తప్ప ఇతరత్రా అవసరాలకు వినియోగించరాదు. అయినా లేఅవుట్ నిర్వహకులు డి-పట్టా భూమిని ఆక్రమించి 60 అడుగుల తారురోడ్డు వేశారు. భూముల రీసర్వేలో ఈ అక్రమాలు వెలుగు చూసినా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు.' -గణేష్, ముషిడిపల్లి ఉప సర్పంచ్, సన్యాసిరావు, ముషిడిపల్లి మాజీ సర్పంచ్
Irregularities of YSRCP Leaders in Swapna Lok Layout : స్వప్న లోక్ లేఅవుట్ అక్రమాలు అంతటితోనే ఆగలేదు. లేఅవుట్ ప్రాంతంలో, 5సాగునీటి చెరువులనూ కబ్జా చేశారు. దీని వల్ల సమీప పంట పొలాలకు సాగునీరు అందకపోవటమే కాక చెరువుల్లో చేపల పెంపకం ద్వారా గ్రామానికి రావాల్సిన ఆదాయానికీ గండి పడిందనే విమర్శలున్నాయి.
లేఅవుట్ ఆక్రమణలపై వైఎస్సార్సీపీ హయాంలోనే స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా అధికారులు అప్పటి పెద్దలకు భయపడి కళ్లు మూసుకున్నారు. స్వప్న లోక్ లేఅవుట్‌లోని ఆక్రమణలను తొలగించాలంటూ తాజాగా కలెక్టరేట్‌లో ప్రజా వినతుల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. స్వప్న లోక్ లేఅవుట్ లోనే కాదు శృంగవరపుకోట నియోజకవర్గంలో చాలా లేఅవుట్లలో కనీస నిబంధనలు పాటించలేదు.
ప్రతి లేఅవుట్లో 10 శాతం భూమిని సంబంధిత పంచాయతీకి ఇవ్వాలనే నిబంధననూ గాలికొదిలేశారు. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇళ్ల నిర్మాణానికీ పంచాయతీ అనుమతులు ఇచ్చేసింది. వీఎమ్ఆర్డీ (VMRDA) అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించారు. ఇవన్నీ అప్పట్లో అధికార పార్టీ నేతల సహకారంతోనే జరిగాయనే ఆరోపణలున్నాయి.
జగన్ సర్కార్ ఎంఐజీ ప్లాట్లతో పాట్లు- కూటమి రాకతో లబ్ధిదారుల్లో సంతోషం - MIG Layout No Facilities