No Quality in Nadu Nedu Works in Singanamala High School : నాడు-నేడు అంటూ బడులకు రంగులు వేసి కోట్లు మింగేశారు. పాఠశాలల రూపురేఖలు మారుస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న బడినీ లేకుండా చేశారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి నిధులు దోచేశారు. సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వ విద్య సలహాదారుగా వ్యవహరించిన ఆలూరు సాంబశివారెడ్డి (Aluru Sambasiva Reddy) చదివిన పాఠశాలే రంగులకు తప్ప పనుల నాణ్యతకు నోచుకోలేదు. నాబార్డు సహకారంతో దాదాపు రూ. 2 కోట్లతో చేపట్టిన పనులు గుత్తేదారులకు లాభం చేకూర్చగా విద్యార్థులకు అవస్థల్ని మిగిల్చాయి. సంవత్సరం గడవక ముందే పాఠశాల గదులన్నీ పెచ్చులు ఊడిపడుతుండటంతో తాళం వేసి ఉంచాల్సిన దుస్ధితి నెలకొంది.
రంగులు వేసి కోట్లు దండుకున్న వైఎస్సార్సీపీ నేతలు : అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలను నాడు-నేడు కింద ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ. 1.54 కోటి రూపాయలను ఖర్చు చేసింది. పాఠశాల గదులన్నింటి పైకప్పులను మరమ్మతులు చేయించారు. గోడలకు రంగులు వేశారు. ప్రధాన గేటును అందంగా అలంకరణ చేశారు. స్కూల్ ప్రహరీ సమీపంలో ఉన్న చిరు వ్యాపారులను తొలగించి మొక్కలు నాటారు. పాఠశాలకు వేసిన రంగులు తప్ప మరే ఏ పనీ నాణ్యతగా జరిగిన దాఖలాలు లేవు. కనీసం విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించలేదు. పాఠశాలలో ఎక్కడ పడితే అక్కడ వర్షం నీళ్లు నిలుస్తున్నాయని పాఠశాల సిబ్బంది అంటున్నారు.
నాడు-నేడు పనుల్లో వైఎస్సార్సీపీ సర్కార్ జాప్యం - కొత్త ప్రభుత్వానికి తప్పని భారం - Incomplete of Nadu Nedu Works in AP
విద్యార్థుల అవస్థలు : నాణ్యత లేకపోవడంతో పాఠశాలలోని దాదాపు 6 గదుల్లో పైకప్పు పెచ్చులూడిపడుతోంది. ఇనుప చువ్వలు, సిమెంటు పెచ్చులు ఉపాధ్యాయులు, విద్యార్థుల తలలపై పడుతుండటంతో తరగతి గదుల్లో కుర్చోవాలంటేనే విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. సర్వశిక్ష అధికారులు నాణ్యతను పట్టించుకోకపోవడం వల్ల గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్ కూడా నిరుపయోగంగా మారాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
"పైన పెచ్చులు ఊడిపోయి మేడమ్ క్లాస్ చెబుతున్నప్పుడు కింద పడ్డాయి. మా స్కూల్లో వాటర్ ఫ్లాంట్ లేకపోవడంతో నీళ్ల తాగడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇంటి వద్దే నుంచే వాటర్ తెచ్చుకుంటున్నాము. దానిని బాగుచేయాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాం"-పాఠశాల విద్యార్థులు
కొందరు కాంట్రాక్టర్లు, నాయకులు అవినీతికి పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం నాసిరకంగా పనులు చేసే గుత్తేదారులను కఠినంగా శిక్షించి భవిష్యత్‌లో ఇలాంటివి పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.