YSRCP Leaders Land Grabbing in Punganur: సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలోని ప్రభుత్వ భూముల దోపిడీని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసేవారన్న వాదన వినిపిస్తోంది. రాగానిపల్లిలోని 982.48 ఎకరాల ప్రభుత్వ భూమికి గతంలో చిత్తూరు జిల్లా సెటిల్‌మెంట్ అధికారి, జేసీగా ఉన్న వెంకటేశ్వర్ పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇందులో దాదాపు 600 ఎకరాలు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా ఉన్న నాయకుడి అనుచరులు, బినామీల చేతుల్లో ఉన్నాయి.
మిగతా వాటిని పుంగనూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆన్‌లైన్ చేయించుకున్నారు. గతంలోనే ఇవి వివాదాస్పద భూములు కావడం, పలువురు న్యాయపోరాటం చేస్తున్నందున, వాటిని అవే పేర్లపై ఉంచితే ఎప్పటికైనా ప్రమాదమని పుంగనూరు నాయకుడు నిర్ధారణకు వచ్చారు. దీంతో సదరు నేత ఆ భూములను ఏపీఐఐసీకి (Andhra Pradesh Industrial Infrastructure Corporation) విక్రయిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని వైఎస్సార్సీపీ పెద్ద దిక్కుకు చెప్పినట్లు సమాచారం. ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత వేగంగా ఈ ప్రక్రియను పట్టాలెక్కించాలని ఇద్దరూ భావించారు. అనుకున్నది అన్నకున్నట్లు జరిగితే పుంగనూరులో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడ్డాయని వైఎస్సార్సీపీలో నంబర్-2గా ఉన్న ‘పెద్దాయన’, ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకునేవారు. దీనికితోడు ఏపీఐఐసీ నుంచి పరిహారం కొట్టేసి, అటు స్వామికార్యం ఇటు స్వకార్యం నెరవేర్చుకునేవారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, చంద్రబాబు సీఎం కావడంతో వైఎస్సార్సీపీ నేతల పన్నాగాలకు అడ్డుకట్టపడింది.
ప్రస్తుతం రాగానిపల్లిలో ఎకరం ధర 10 లక్షల వరకు ఉంది. ఈ లెక్కన 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వైఎస్సార్సీపీపా నేతల పరమయ్యాయి. వాటిని 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలకు ఏపీఐఐసీకి బేరం పెట్టాలని అనుకున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీకే మరోసారి అధికారం దక్కి ఉంటే ప్రభుత్వాన్నే ప్రభావితం చేయగల ‘పెద్దాయన’ ఈ ధరకు విక్రయిస్తారనడం సందేహం లేదు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే వైఎస్సార్సీపీ నేతలు 982.48 ఎకరాలను ఆ సంస్థకు ఇచ్చి వందల కోట్లు కొల్లకొట్టేవారు.
అనంతరం ఏమైనా వివాదాలు వస్తే- ఏపీఐఐసీనే న్యాయ పోరాటం చేయాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెటిల్‌మెంట్ అధికారి తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు కావడంతో ‘పెద్దాయన’, పుంగనూరు వైఎస్సార్సీపీ నేత ప్రణాళికలు తలకిందులయ్యాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాదం చిత్తూరు జిల్లాలో కూడా కలకలం రేపింది. పొరుగునే ఉన్న పుంగనూరు నియోజకవర్గం రెండేళ్ల కిందట వరకు మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండటమే దీనికి కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంతో పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పలమనేరు డివిజన్‌లోకి వచ్చాయి.
మరో రెండు మండలాలు చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఇందులో రాగానిపల్లిలోని 982 ఎకరాల అనాధీనం భూమికి గత సంవత్సరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు పట్టా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత దస్త్రాలు ఇప్పటికీ మదనపల్లెలోనే ఉన్నాయా అని చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులూ ఆరా తీశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు ఏర్పాటైన తొలినాళ్లలోనే ఆయా దస్త్రాలు సంబంధిత రెవెన్యూ డివిజన్లకు చేరాయంటూ క్షేత్రస్థాయి సిబ్బంది సమాధానమిచ్చారు. రాగానిపల్లి భూముల పాత రికార్డుల పరిశీలన ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.