YSRCP Leaders Illegal Registration: నకిలీ పత్రాలతో కోటి రూపాయల విలువైన భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారు. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో తమకు చెందిన అరెకరా భూమిలో 19 సెంట్లను వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని బాధిత మహిళ వాపోయారు. ఈ మేరకు 2023 జులై 13న తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కలెక్టర్ వెంకట మురళీకి రేపల్లె నియోజకవర్గం నగరం మండలం పెదమట్ల పూడికి చెందిన మహిళ షేక్ రహంతున్నీసా ఫిర్యాదు చేశారు. మర్రిప్రోలువారిపాలెంలో సర్వే నంబర్ 213/6, 99/19లో తన తల్లి షేక్ సమీమున్ని సాబి 50 సెంట్ల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఆమె పేరు మీద ఉన్న అరెకరా పొలమే తమ కుటుంబానికి జీవనాధారమని అన్నారు.
అయితే ఆ భూమి దశాబ్దాల నుంచి తమ స్వాధీనంలోనే ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతల కన్ను తమ భూమిపై పడిందని, వీఆర్ఓ, తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి బాపట్ల పట్టణం బెస్తపాలెంకు చెందిన హోటల్లో పనిచేసే కార్మికుడు మూర్తికుమార్ అనే వ్యక్తి పేరుతో భూమి ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. అనంతరం నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి తప్పుడు పత్రాల ద్వారా మూర్తి కుమార్ నుంచి వైఎస్సార్సీపీ నేతలు నక్కల నాగార్జున, మరుప్రోలు చెన్నకేశవరెడ్డి, కోకి రామిరెడ్డి పేర్లు మీద రిజిస్ట్రేషన్ చేశారన్నారు.
తొలుత ఓ వ్యక్తి పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించారని, ఈ విషయం తన దృష్టికి రావడంతో బాపట్ల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి విచారించామని తెలిపారు. అయితే ఆ సమయంలో మూర్తి కుమార్ పేరుతో భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేయలేదని తెలుపుతూ అధికారులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి ఫిర్యాదు చేయగా అప్పటి ఎమ్మెల్యే కోనా రఘుపతి భూమికి రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తేవడంతో తాము చేసినట్లు చెప్పారని తెలిపారు. ఆ స్థలం స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని 2011లో జారీ చేసినట్లు రికార్డుల్లో చూపించగా, అది జారీ చేసిన వీఆర్ఓ 2010 లోనే రిటైర్ అవ్వడం గమనార్హం.
హక్కు పత్రాలను సబ్ రిజిస్ట్రార్‌కు చూపించగా, మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారని అన్నారు. అదే విధంగా నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వైఎస్సార్సీపీ నేతలకే వత్తాసు పలికారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి వైఎస్సార్సీపీ కబ్జాదారుల నుంచి తమ భూమిని రక్షించాలని బాధితులు వేడుకున్నారు.