YSRCP Leaders Attack in KP Gudem in Election Polling Day : ఎన్నికల పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ గుండాలు బీభత్సం సృష్టించారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేక్యానాయక్పై బరిసెలతో దాడి చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను తరిమికొట్టి ఈవీఎంలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేపీ గూడెం వాసులు పోలింగ్ రోజున జరిగిన ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులే అక్కడ ఉంటే ప్రాణాలు పోతాయని చెప్పి టీడీపీ కార్యకర్తలను తమ వాహనంలో గ్రామం దాటించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. టీడీపీకి చెందిన గిరిజనులు ప్రాణ భయంతో మిన్నకుండిపోయారు. వారు నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేపీ గూడెంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకానికి సంబంధించిన దృశ్యాలు ఇవాళ బయటకు వచ్చాయి.
అగమ్యగోచరంగా పిన్నెల్లి రాజకీయ జీవితం - ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేనా? - Pinnelli Political Career
తననూ ప్రశ్నించిన వారిపై దాడులు, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పిన్నెల్లి ప్రఖ్యాతి గాంచాడు. అయిదేళ్ల ఆయన పరిపాలనలో మాచెర్ల ప్రజలు విసుగు చెందారు. 2024 జరిగిన ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదు అనే భయంతో పిన్నెల్లి, ఆయన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్ల, కార్యకర్తలపై దాడులకు తెగబడి భయాందోళన సంఘటనలను సృష్టించారు. అంతటితో ఊరుకోక ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ జరగని విధ్వంసకాండను మాచెర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సృష్టించారు. మాచెర్ల నియోజకవర్గంలో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ప్రజలందరిని భయకంపితులను చేశారు. మే13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన అనుచరులు విధ్వంసం సృష్టిస్తుంటే అడ్డుకోవలసిన పోలీసులు ఆయనకు వంత పాడినట్లు వ్యవహరించారు. తమకు ఈ గొడవలకు ఎలాంటి సంబంధం లేని విధంగా నడుచుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు, ఏజెంట్లుపై దాడి చేస్తుంటే పోలీసులు వారిని కట్టడి చేయలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.