YSRCP Leader Sajjala Ramakrishna Reddy Lookout Notice Issue : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సకలశాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సజ్జలను అడ్డుకోవడంతో ఈ నోటీసుల అంశంపై వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సజ్జల సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారని, అదుపులోకి తీసుకోవద్దని గుంటూరు ఎస్పీ సూచించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.
సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు జారీ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు అన్నీ తానై చక్రం తిప్పిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దేశం విడిచి వెళ్లకుండా గుంటూరు ఎస్పీ లుక్ అవుట్ నోటీసులిచ్చిన విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ధ్రువీకరించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సజ్జలను ముంబై ఎయిర్‌పోర్టులో సోమవారం ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. గుంటూరు జిల్లా పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు ఉందని చెప్పి సజ్జలను అడ్డుకున్నారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల తాను విదేశాల నుంచి వస్తున్నానని ఎలాంటి కేసులు లేవని తెలిపారు.
సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - రెండు దాడి కేసులు సీఐడీకి బదిలీ
సుప్రీంకోర్టు నుంచి రక్షణలో ఉన్నా తనను ఎందుకు ఆపుతున్నారని సజ్జల ప్రశ్నించినట్లు తెలిసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు గుంటూరు ఎస్పీకి సజ్జల సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు మెయిల్ ద్వారా సమామాధానం ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారని అదుపులోకి తీసుకోవద్దని సూచించారు.
120వ నిందితుడిగా సజ్జల : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ నిందితుడిగా ఉన్నారు. అయితే నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృత్తం అయ్యాయని వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఆయన ఈ కేసులో 120వ నిందితుడేనని పోలీసు వర్గాలు స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు ఉంది: ఏపీ డీజీపీ
సజ్జలకు నోటీసులు : సజ్జల దేశం విడిచి వెళ్లకుండా 15 రోజుల క్రితం లుక్ అవుట్ నోటీసులు పంపి అప్రమత్తం చేశామని వెల్లడించారు. అందులో భాగంగానే ఆయన విదేశాల నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అధికారులు తమకు సమాచారమిచ్చారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తాము లుక్ నోటీసులు ఇవ్వటానికి ముందే సజ్జల విదేశాలకు వెళ్లారని గుర్తు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించవచ్చని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీఐడీకి బదలాయించటంతో సంబంధిత అధికారులు సజ్జలకు నోటీసులు పంపి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.