YSRCP Leader Perni Kittu Followers Attack on TDP Activist: మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్త ఇంటిపైకి పేర్ని కిట్టు అనుచరులు దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఉల్లిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈడే యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యశ్వంత్‌ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.
తమ గ్రామంలో టీడీపీ బ్యానర్లు కడుతున్నాడని కక్ష పెట్టుకుని 20 మంది వైసీపీ నాయకులు కిరాతకంగా దాడి చేశారని యశ్వంత్ బంధువులు తెలిపారు. ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి, కారులో ఎక్కించుకుని బయటకు తీసుకుని వెళ్లారని, తీవ్రంగా కొట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. తమ అబ్బయిని చంపేస్తారు ఏమో అని భయంగా ఉందన్నారు. అసలు ఏం చేశారని ఇంత దారుణంగా దాడి చేశారంటూ ప్రశ్నించారు.
తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త యశ్వంత్‌ను పరామర్శించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పత్తి పవన్, హేమ నాని, చరణ్, పత్తి రామారావు ఇలా మొత్తం 20 మంది వరకు ఉన్నారని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. పేర్ని కిట్టు, అతని అనుచరులపై బాధిత యశ్వంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు
"పని చేసుకుని వచ్చి ఇంట్లో ఉన్నాడు. అ సమయంలో ఎవరో ఫోన్ చేస్తే, ఇంటి బయటకు వెళ్లాడు. కారులో ఒక 20 మంది వరకూ వచ్చారు. మా అబ్బాయిని కొట్టి, కారులో ఎక్కించుకుని ఎక్కడెక్కడో తిప్పారు. తరువాత పోలీస్ స్టేషన్ దగ్గరకి తీసుకుని వెళ్లారు అంట. మా అబ్బాయి ఇంటికి రాలేదు ఏంటి అని ఆరాతీస్తే ఇలా జరిగింది అని తెలిసింది. అయ్యా నాని గారు మీకు నమస్కారం, మా లాంటి అబ్బాయే మీకు కూడా ఉన్నాడు కదా. మరి ఎందుకు మా అబ్బాయిపై ఇంత కక్షగట్టి కొట్టించారు". - బాధితుడి తల్లి
"అసలు అతడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కింద పడిపోతూ ఉన్నాడు. అతనిని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాధేయపడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ వింత సంస్కృతికి బాధ్యత మీరేనా లేదంటే మీ కుమారుడా అని పేర్ని నానిని అడుగుతున్నాను. మీ కుమారుడి అనుచరులతో దాడులు చేపిస్తారా. అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు". - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి
నడివీధిలో దళితుడిపై వైసీపీ నేతల దాడి - ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు