YSRCP LEADER IRREGULARITIES: వైవిధ్యభరితమైన జీవజాతులకు ఆవాసం కొల్లేరు. పర్యాటకంగా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాంతం ఐదేళ్లుగా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి చేతుల్లో విధ్వంసానికి గురవుతోంది. వేల ఎకరాలను యథేచ్ఛగా ఆక్రమించి, అదే పనిగా చెరువులు తవ్వేసి, చేపల సాగుకు లీజుకు ఇచ్చేసి వందల కోట్లు వెనకేసుకున్నారు.
వైసీపీ ఏలుబడిలో కొల్లేరు చెరబట్టిపోవడానికి కీలక సూత్రధారి ఈయనే. అయిదో కాంటూరు పరిధిలో అసలు చెరువులే ఉండకూడదని చట్టం చెబుతుంటే, ఈయన మాత్రం 'తవ్వుకో అబ్బాయి మనదే' అన్నట్లు చెరువులు తవ్వించి అనుచరులకు అప్పగించారు. కొల్లేరు అభయారణ్యంలో రహదారులకు చోటే లేదు. కానీ ఆయన చట్టవిరుద్ధంగా రోడ్లను వేసేశారు. ఎవరైనా కొత్తగా చెరువు తవ్వుకోవాలంటే ఎకరానికి 20 వేల నుంచి 30 వేల వరకు అబ్బాయిగారికి కప్పం కట్టాల్సిందే.
డబ్బు ఇవ్వకపోతే వాహనాలు సీజ్: పర్యావరణానికి చేటు చేయడంలో ముందున్న ఈ ప్రజాప్రతినిధి కొల్లేరులోని చేపల చెరువులకు కోడి వ్యర్థాలు దగ్గరుండి రవాణా చేయిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రప్పించి యథేచ్ఛగా కొల్లేరుకి పంపిస్తారు. పెద్ద లారీ లోడు తీసుకెళ్లాలంటే లక్షలు, చిన్న వ్యాన్ అయితే వేల రూపాయలు వసూలు చేస్తారు. అయిదేళ్లగా ఈ దోపిడీ కోట్ల రూపాయల్లో సాగింది. పోలీసులు, అధికారులు ఎవరూ ఈ రవాణాను అడ్డుకోరు. ఎందుకంటే యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఈయన ముందే ఇస్తారు. పాటించకపోతే వేధిస్తారు. ఎవరైనా ఈయనకు డబ్బు ఇవ్వకుండా కోడి వ్యర్థాలు తరలిస్తే, వెంటనే వాహనాలు సీజ్ చేసేస్తారు. కేసులూ పెట్టేస్తారు.
కాలువ గట్లపై రౌడీ మూకల కాపలా: తమ్మిలేరు ఇసుక తరలింపు ఈయనకు కాసుల పంట పండిస్తోంది. పల్లెల్లో వాహనాలుండే వైసీపీ వారిని వాడుకుంటూ, అనుమతులు, నిబంధనలకు నీళ్లొదిలి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో ట్రక్కు మట్టి 4 నుంచి 5 వేలకు విక్రయిస్తూ, రోజుకు 5 నుంచి7 లక్షల వరకు తన ఖాతాలో జమచేసుకంటున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయిస్తారు. పోలవరం కుడికాలువ గట్టుపై అడ్డగోలుగా మట్టి, గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు. కాలువ గట్లపై రౌడీ మూకలను కాపలా పెట్టి, ఎవరినీ అటు వెళ్లనీయరు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం నాయకులపై దాడులు చేయించి, ఎదురు కేసులు పెట్టించారు. 4 మండలాల్లో వందల సంఖ్యలో ఉన్న చెరువుల్లో మట్టిని మింగేశారు.
జగనన్న ఇళ్ల స్థలాల్లో: జగనన్న కాలనీల లేఅవుట్ల స్థల సేకరణ విషయం ముందే తెలుసుకొని, రైతులను భయపెట్టి బినామీలతో ఎకరం 20 నుంచి 25 లక్షలకు కొనుగోలు చేయించారు. ప్రభుత్వానికి 40 నుంచి 50 లక్షల చొప్పున అమ్మించారు. అనుచరుల భూములే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయించి భారీగా దండుకున్నారు. మెరక పనుల పేరుతోనూ దోపిడీకి తెరతీశారు. సమీప ప్రాంతాల నుంచే మట్టి తరలించి, దూరం నుంచి తెచ్చినట్లు బిల్లులు పుట్టించారు. పోలవరం కుడి కాలువ గట్టు ఆక్రమణలు జరిగినా ఈయన పట్టించుకోలేదు. పైగా ఆక్రమించుకుని సాగు చేసిన వారికి అండగా నిలిచారు. కొందరైతే కోళ్లఫారాలూ పెట్టారు. అంతేకాదు వందల ఎకరాల్లో భూములు ఈయన అండతోనే ఆక్రమణదారుల పరమయ్యాయి. భూమి విలువలో 30 శాతం ఈయనకు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా గుత్తేదారులు ఆయనకు వాటా చెల్లించుకోవాల్సిందే.
అయిదేళ్లుగా అదే పని: సంక్రాంతి వేళ కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తారు. ఈయన నియోజకవర్గంలో అయితే అయిదేళ్లుగా అదే పని. ఓ గ్రామమైతే ఏకంగా జూద క్రీడలకు అడ్డా అయ్యింది. తెలంగాణ వాళ్లూ జూదమాడేందుకు ఇక్కడికి వస్తున్నారు. కొన్ని ఊళ్లలో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. బరిలోకి వెళ్లాలంటే వెయ్యి, పార్కింగ్‌కు అదనంగా చెల్లించాలి. రోజుకు 5 లక్షల వరకు కమీషన్ ఈయనకు దక్కుతుంది. పోలీసులు కన్నెత్తి చూస్తే ఒట్టు.
వైసీపీ కార్యకర్తల బెల్టు దుకాణాలు: పేరుకే చేసేది అబ్బాయిగారు అయితే, వసూళ్లు, ఎదిరించిన వారి లెక్కలు చూసేది మాత్రం తండ్రే. భార్యాభర్తల గొడవల మొదలు, అన్ని వివాదాలకూ ఆయనే సెటిల్‌మెంట్లు చేస్తారు. అక్రమాలను ప్రశ్నించినా, ఫిర్యాదులు చేసినా వారిని బెదిరింపులతో దారిలోకి తెస్తారు. ప్రశ్నించిన వారిపై దాడులూ చేయించారు. ఎస్సీ, ఎస్టీ, అత్యాచార కేసులు పెట్టించారు. చెప్పిన వారిపై కేసులు నమోదు చేయకపోతే ఊగిపోయేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారంటే ఈ అబ్బాయిగారి తండ్రి చలవే.
నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities