YSRCP Kodali Nani Nomination: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నామినేషన్ కార్యక్రమం వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నం చేసినా, ఫలితం లేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం మాత్రం రాలేదు.
గత ఐదేళ్లుగా గుడివాడలో నాని చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడమే దీనికి కారణం. జనానికి మంచినీరు, రహదారుల సమస్యలను కొడాలి నాని కనీస స్థాయిలోనూ పరిష్కరించలేకపోయారు. దీంతో ఆయన ప్రచారానికి వెళితే నిలదీతలు తప్ప స్వాగతాలు ఎక్కడా లేవు. అందుకే సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ హారతులిప్పించుకోవడం, పూలు చల్లించుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాని వేసిన నామినేషన్ కార్యక్రమానికి కూడా జనాలు కరవై పేలవంగా మారింది.
కొడాలి నాని ఇంట దగ్గర నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లే రూట్‌మ్యాప్‌ను అధికారులు ఇచ్చారు. టీడీపీ కార్యాలయం వైపు రాకుండా, వేరే మార్గంలో వెళ్లేలా అనుమతి ఇచ్చారు. కానీ ఈ మార్గాన్ని మార్చి ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం మీదుగా వెళ్లాలని నాని వర్గం ప్రయత్నించింది. టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లి గొడవకు కాలు దువ్వాలని అనుకున్నారు. కానీ గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేందుకు అవకాశం ఉందని ముందే అప్రమత్తమైన పోలీసులు, అటువైపు వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్నారు.
అయినా పట్టువదలకుండా రాజేంద్రనగర్ ఎస్‌బీఐ బ్యాంకు మీదుగా ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం వైపు ప్రవేశించేందుకు వైసీపీ మూక ప్రయత్నించింది. ఎవరు అడ్డుకున్నా ఆగేదే లేదంటూ గొడవకు కాలు దువ్వారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి, వారితో వాగ్వాదానికి సైతం దిగారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో కొడాలి నాని అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఏలూరు రోడ్డు, మార్కెట్ సెంటర్, పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి చేరింది.
మరో వివాదంలో కొడాలి- మహిళలతో పాదపూజలు - Kodali Nani milk abhishekam video
పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ర్యాలీగా తీసుకొనిరాగా, నెహ్రూ చౌక్‌కు చేరుకునేసరికి, వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు. వారిని ర్యాలీలో ఉండాలని, వెళ్లిపోవద్దంటూ వైసీపీ నేతలు బతిమాలినా, ఎవరూ వినలేదు. గత వారం రోజులుగా నాని నామినేషన్ ఉందంటూ గుడివాడ నియోజకవర్గంలో మైక్‌లలో ఊదరగొట్టి మరీ ప్రచారం చేశారు. గురువారం ఉదయం నుంచి మనిషికి రూ.300, మద్యం, బిర్యానీ ఇస్తామని చెప్పి జనాన్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు పెట్టి మరీ జనాన్ని తీసుకొచ్చినా, వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం గమనార్హం.
మహిళతో అసభ్య ప్రవర్తన: కొడాలి నాని ర్యాలీలో పాల్గొన్న వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు శరత్ థియేటర్ ప్రాంతంలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ర్యాలీలో జెండా పట్టుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. దీంతో ఆమె వర్గీయులు వచ్చి, వారిద్దరికీ దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను బయటకు రాకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడినట్టు సమాచారం.