YSRCP Irregularities in AP Fibernet company : ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఫైబర్‌నెట్ సంస్థకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ లేఖ తీసుకు రావడమే ఆలస్యం అన్నట్లు సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు. ఫైబర్‌నెట్‌ను సొంత జేబు సంస్థలా వైఎస్సార్సీపీ మార్చుకుందనడానికి ఇదే నిదర్శనం.
అవసరం లేకపోయినా సిబ్బందిని నియమించడం వల్ల ఆర్థికంగా భారం పెరిగి ఫైబర్‌నెట్ సంస్థ మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో పాటు ఐదేళ్ల వ్యవధిలో సంస్థ పేరిట 1,250 కోట్ల రూపాయలు అప్పులను గత ప్రభుత్వం( వైఎస్సార్సీపీ) తీసుకుంది. ఆ మొత్తాన్ని సంస్థ అభివృద్ధి కోసం కాకుండా పర్సంటేజీలు తీసుకుని గుత్తేదారులకు బిల్లులు చెల్లించడానికి వినియోగించింది. ఈ తరహాలో జగన్ హయాంలో ఫైబర్‌నెట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
సంస్థలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఆధారాలను ధ్వంసం చేసేందుకు కొందరు సిబ్బంది ఇప్పటికే ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే సంస్థ కార్యాలయాన్ని చంద్రన్న సర్కారు సీజ్ చేసింది. కేబుల్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సేవలను కొనసాగించేలా ఆపరేటర్లతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే అందుకు అనుగుణంగా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఒక ఉన్నత అధికారి తెలిపారు.
రూ.1,250 కోట్లు ఏమయ్యాయి? : ఆఖరి ఏడాదిలో ఫైబర్‌నెట్ సంస్థ ఆదాయాన్ని హామీగా చూపి జగన్ సర్కారు రెండు దఫాలుగా రూ.1,250 కోట్లు అప్పు తెచ్చింది. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇందులో 950 కోట్లు రూపాయలు భారీగా కమీషన్ తీసుకుని సీసీ కెమెరాలను పర్యవేక్షించే గుత్తేదారుకు జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ వ్యవహారంలో పర్సంటేజీల రూపంలో దాదాపు 150 కోట్లు రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఐదేళ్ల పాటు వారికి బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా అప్పు తీసుకువచ్చి చెల్లించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
ఎండీగా ముగ్గురి పేర్ల పరిశీలన : సంస్థ పాలనా వ్యవహారాల కోసం పూర్తి స్థాయిలో కొత్త ఎండీని నియమించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నత అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే ఫైబర్‌నెట్‌కు ఎండీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ముగ్గురు అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గత ఎండీ మధుసూదన్‌రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు పంపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. చంద్రబాబు సర్కారు ఆయన్ను రిలీవ్ చేయలేదు. కొత్త ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇసుక టెండర్లలో గోల్మాల్ - జగన్ మార్క్ అడ్డాగా దోపిడీ - YSRCP Irregularities Sand Tenders
పనిచేసేది ఎందరు.. బినామీలు ఎంత మంది? : అవసరం లేకున్నా అడ్డగోలుగా వందల సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో సంస్థపై జీతాల భారం మూడు రెట్లు పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019లో నెలకు 59 లక్షల రూపాయల చొప్పున జీతాల కింద చెల్లించేవారు. కొత్త సిబ్బందిని నియామించడంతో అది 2024 నాటికి సుమారు 2 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు సంస్థకు ఆదాయాన్ని పెంచేందుకు కొత్త కనెక్షన్లను కూడా గత ప్రభుత్వం పెంచలేదు. దీంతో సంస్థ నష్టాలు నెలకు 5 కోట్ల రూపాయలకు మించింది. ఇందులో జీతాల రూపంలో సంస్థపై పడిన అదనపు భారం 1.4 కోట్లు రూపాయలు. విజయవాడలోని సంస్థ కేంద్ర కార్యాలయం, వివిధ జిల్లాల్లో పనిచేసే సిబ్బంది సంఖ్య దాదాపుగా 1,429గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు? వారి సేవలు సంస్థకు అవసరమేనా? బినామీ పేర్లతో జీతాలు తీసుకుంటున్నారా అన్న వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సీజ్ చేసినా ఆన్‌లైన్‌లో రోజువారీ హాజరు తీసుకుంటున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur
సంస్థలో వందల సంఖ్యలో సిబ్బందిని నియమించిన తర్వాత కూడా నిర్వహణ బాధ్యతలను గుత్తేదారు సంస్థకు గత ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థకు ఏటా 10 కోట్ల రూపాయలకు పైగా జగన్ సర్కారు చెల్లించింది. ఆ టెండరు కూడా వైఎస్సార్సీపీ నాయకుడికే కట్టబెట్టినట్లు తెలిసింది. దీంతో నిర్వహణ పనులు మొత్తం సంస్థ సిబ్బంది ద్వారా చేయిస్తూ గుత్తేదారు సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్లు సమాచారం.