YSRCP Govt on AB Venkateswara Rao Posting Pending : ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం పగబట్టింది! ఆయన సస్పెషన్ చెల్లదని క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులవుతున్నా ఇంతవరకూ విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీ వెంకటేశ్వవరావు పదవీ విరమణ చేయనుండగా అప్పటి వరకూ విధుల్లోకి తీసుకోరాదని పంతం పట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కావాలనే పోస్టింగ్ ఇవ్వడం లేదని అర్థమవుతోంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, ఐదేళ్లూ అక్రమ కేసులతో వేధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్-క్యాట్ ఈ నెల 8నే (మే 8న) తీర్పు ఇచ్చింది. పదిరోజులైనా ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు.
పోస్టింగ్‌లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao Vote Issue
క్యాట్ తీర్పు ప్రతులు బయటకు రావడానికి 3 రోజుల సమయం పట్టగా ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిసి తనను విధుల్లోకి తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి పొంది ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలి. ఐతే ఆ దస్త్రాన్ని ఎన్నికల సంఘానికి కాకుండా సీఎం జగన్‌కు పంపించినట్లు సమాచారం. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తెచ్చారని తెలుస్తోంది.
ఈ నెలాఖరున ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు! అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ జవహర్‌రెడ్డి గురువారం ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు! వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేసినా సీజే అనుమతి లభించకపోవడంతో అది అడ్మిట్ కాలేదు.
ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో ఏర్పాడిన హింసాత్మక సంఘటనలకు బాధ్యుడ్ని చేస్తూ ఈసీ తనపై చర్యలు తీసుకుంటే తన తర్వాత వచ్చే అధికారి ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేస్తారేమోనని సీఎస్ జవహర్‌రెడ్డి దిల్లీలో ఈసీ ఎదుట హాజరుకావడానికి ముందే క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాలు చేశారనే అనుమానం ఐపీఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ఆయన సీఎస్ పోస్టులో లేకున్నా ఏబీవీకి పోస్టింగ్ రాకుండా అడ్డంకులు సృష్టించారన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవంగా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలను అమలు చేయకపోవడం ధిక్కారమేని ఐపీఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది! క్యాట్ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్లేదని ఐపీఎస్ వర్గాల వారు మండిపడుతున్నారు. చివరికి విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల ఓట్లూ తొలగించేశారు. ప్రభుత్వ ఫ్యాక్షనిజంతో అత్యంత విలువైన సర్వీసును కోల్పోయిన ఏబీవీకి పదవీకాలం చివర్లోనూ క్షోభ తప్పడం లేదు.