YSRCP Govt Neglect By Kurnool Public Hospital: రాయలసీమ వైద్య ప్రదాయినిగా ఆ ఆస్పత్రికి పేరు. నిత్యం వేలాది మందికి సేవలు అందిస్తున్న పెద్దాసుపత్రిగా ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న కర్నూలు సర్వజన వైద్యశాలకు గత ఐదు సంవత్సరాలుగా సుస్తి చేసింది. వైఎస్సార్సీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆసుపత్రి నీరసించిపోయింది. ఐసీయూలోనూ కనీస వసతులు లేకపోవటంతో రోగులకు ఇక్కట్లు తప్పటం లేదు.
కర్నూలు సర్వజన వైద్యశాలకు నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. గత ఐదు సంవత్సరాలలో ఆసుపత్రి అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా కనీస నిర్వహణకూ నిధులు విదల్చలేదు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. పెద్దాసుపత్రి మాతాశిశు సంరక్షణా భవనంలో పిల్లల విభాగం ఉంది. పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తారు. నిత్యం పదుల సంఖ్యలో ఇక్కడ పిల్లలు వైద్యం పొందుతుంటారు. కానీ ఐసీయూలో ఏసీలు పని చేయటం లేదు. దీంతో ఉన్న ఫ్యాన్లతోనే రోగులు సర్దుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అది కూడా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని రోగుల బంధువులు వాపోతున్నారు.
ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేవారంతా పేద, మధ్య తరగతి రోగులే. కానీ వారికి కనీస వసతులు కల్పించటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పిల్లల వార్డుల్లో ఏసీలే కాదు నీరు కూడా లేకపోవటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. మరుగుదొడ్లలో గత కొన్ని నెలలుగా నీటి సరఫరా లేకపోవటంతో తలుపులకు గొల్లెం పెట్టేశారు. వాటిని కనీసం శుభ్రం చేయకపోవటంతో దుర్గంధం వెదజల్లుతోంది. అత్యవసరాలకు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని రోగుల సహాయకలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో కనీసం నీటి సౌకర్యం లేదు. ఐదు సంవత్సరాలుగా ఈ గొప్ప గొప్ప నాయకులంతా ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు. ఐసీయూలో ఏసీలు పని చేయట్లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కొన్ని రోజులలోనే నీటి సమస్యను పరిష్కరిస్తాం. ఆసుపత్రిలో తాగునీరు అనేది కనీస ప్రాధాన్యం. దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని పరిశీలిస్తుంటా. ఒక దాని తర్వాత ఒకటి సమస్యలన్నీ పూర్తి చేస్తాం. - టీజీ భరత్, మంత్రి
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి టీజీ భరత్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. ఏసీలు లేకపోవటం, ఆసుపత్రిలో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు.
ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur