YSRCP Government Tortured Government Employees : పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బకాయిలు హడావుడిగా చెల్లించే నిర్ణయం తీసుకుంది. పోలీసులతోపాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశముంది. తమ ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తమకు రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములనే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమకల్పిస్తోందని మండిపడ్డారు.
న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ తాము ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించులేదన్నారు. పైగా తమ ఆందోళనలు, ఉద్యమాలను జగన్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసిందని గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. సుమారు 17 వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా.. అవన్నీ పెండింగ్‌లో పెట్టిందని సరెండర్ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తోందని ధ్వజమెత్తారు. అదీ అందరికి ఒకేసారి ఇవ్వకుండా, విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డీఏ, పీఆర్సీ బకాయిలు 7వేల 500 కోట్ల రూపాయలు రావాలి. వీటిని 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. టీఏ, డీఏ బకాయిలు 274 కోట్ల రూపాయలవరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు 2వేల 250 కోట్ల రూపాయలు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే 500 కోట్ల రూపాయలు.
2021-22 నాటికి పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరో 300 కోట్ల రూపాయలు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు 118 కోట్ల విడుదల చేయలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సినవి సుమారు 9వందల33 కోట్ల రూపాయలు ఉన్నాయి. సీపీఎస్, పెన్షనర్లకు నగదు రూపంలో డీఏ బకాయిలు 2వేల 100 కోట్లు చెల్లించాల్సి ఉంది.
2022లో ఇవ్వాల్సిన రెండు డీఏల బకాయిలు కలిపి 4వేల 500 కోట్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్ సర్కారు ఉద్యోగులను పలురకాలుగా వేధించింది. 11వ పీఆర్సీలో మోసగించింది. మధ్యంతర భృతి 27 శాతముంటే దానిలో 4శాతం తగ్గించి 23శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు ఐఆర్‌తో పొందిన జీతం కంటే ఫిట్‌మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోవడం చరిత్రలో తొలిసారి. ఇంటి అద్దె భత్యంలోనూ కోత పెట్టింది.
రాష్ట్రంలో ఐదేళ్లుగా బానిసల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలు - United form Round Table Meeting
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో 30 శాతమున్న హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20 శాతమున్న హెచ్‌ఆర్‌ఏను 16 శాతానికి కుదించింది. 11వ పీఆర్సీ సిఫారసు చేసిన పేస్కేళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసింది. 2023 జులై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాలి. ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాల్సి ఉన్నా ఆ గడువు దాటి 10 నెలలైనా ఇప్పటికీ ఐఆర్ ప్రకటించలేదు.
చలో విజయవాడ ఆందోళన : ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన దాష్టీకాలకు అంతేలేదు. పీఆర్సీ అంశంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. చివరకు లక్షల మంది ఉద్యోగులు బీఆర్‌టీఎస్ రహదారిని దిగ్బంధించడంతో కంగుతిన్న ప్రభుత్వం అనేక మందిని అరెస్ట్ చేసి, కేసులు పెట్టింది. నాటి నుంచే ఉద్యోగులపై కక్షగట్టింది. ఉద్యమానికో, నిరసన ప్రదర్శనకో పిలుపునిస్తే చాలు వారిని గృహనిర్బంధం చేసింది.
ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వైసీపీ నాయకులు ఉద్యోగులను అవమానాలకు గురిచేశారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లకు కాపలా ఉంచి, మరుగుదొడ్లు కడిగించి అవమానించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తే ఇన్నాళ్లూ ఎదుర్కొన్న వేధింపులను మర్చిపోతామా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 17 వేల కోట్ల రూపాయలకుపైగా ఉన్న బకాయిలను పూర్తిగా ఎందుకు చెల్లించడం లేదని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు బకాయిల విడుదల అంటే ఉద్యోగులను ప్రలోభపెట్టే చర్యేనని అది వారికీ తెలుసని అంటున్నారు.