YSRCP Government Not Solve the People Minimum Problems: అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయి అనే నినాదంతో జగన్ పాదయాత్ర చేశారు. అన్న వచ్చిన ఐదు సంవత్సరాలలో మంచి రోజుల మాట పక్కన పెడితే ప్రజలకు కనీస సమస్యలు కూడా తీర్చలేకపోయారు. ప్రకాశం వాసులకిచ్చిన హామీలను తుంగలో తొక్కి జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు. జగన్ పాలనలో గ్రానైట్ పరిశ్రమల యజమానుల నుంచి సుబాబుల్, జామాయిల్ రైతుల వరకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా నష్టపోయారు. మాట తప్పడం తన జన్మహక్కు - మడమ తిప్పడం తన సహజ గుణం అని నిరూపించుకున్న సీఎం జగన్ మరోసారి ప్రకాశం ప్రజలను మోసగించేందుకు బస్సుయాత్ర పేరిట నేడు జిల్లాలో పర్యటించనున్నారు.
సామాన్యులకు శాపంగా జగన్ సభలు - బస్సుల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూపులు
సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2018 ఫిబ్రవరి 16 నుంచి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. అనేక బహిరంగ సభల్లో వేళ్లపై లెక్కపెట్టలేనన్నిహామీలు ఇచ్చారు. అయితే ఐదు సంవత్సరాల పాలనలో ఏ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదు. సోమశిల ప్రాజెక్టు నుంచి ఇక్కడికి నీటిని మళ్లించే కాలువ పనులు దాదాపు పూర్తయినా నీటిని మాత్రం మళ్లించలేకపోయారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు అయితే కనీసం స్పిల్‌వే రెగ్యులేటర్ గేట్లకు గ్రీజు కూడా పూయలేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సంవత్సరం వ్యవధిలోనే తుప్పుపట్టిన గేట్లు కొట్టుకుపోయి జలాశయంలో నీళ్లన్నీ సముద్రం పాలయ్యాయి. గేట్ల మరమ్మతులకు ఏ మాత్రం శ్రద్ధం చూపలేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కరవు నేలల్లో నీళ్లు పారిస్తానని బీరాలు పలికారు. తీరా చూస్తే రెండు సొరంగం పనుల్లో టీడీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేస్తే మిగిలిన 20 శాతం పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కాలువ పనులు పూర్తి చేయకుండా రిబ్బన్ కట్ చేయడంపై ప్రజలంతా నిర్ఘాంతపోయారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేయకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నెల్లూరువాసులను నట్టేట ముంచారు - CM Jagan Visit to Nellore
జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి వాటర్ గ్రిడ్ ద్వారా పశ్చిమ ప్రకాశంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా అడుగులు వేయలేదు. గొట్టిపడియ వద్ద వాటర్‌గ్రిడ్ పంప్‌హౌస్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో మార్కాపురం, పొదిలి, పెద్దరావీడు, కనిగిరి, పుల్లలచెరువు, తుర్లపాడు, యర్రగొండపాలెం ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. ఒంగోలులో నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం-2 కింద రూ.333 కోట్లు మంజూరు చేసినా టెండర్ దక్కించుకున్న మెగా సంస్థ పనులు ప్రారంభించలేదు.
సంవత్సరం క్రితం అంబటి రాంబాబు పర్యటించి నెల రోజుల్లో పనులు పూర్తి చేసి నీళ్లు నిలబెట్టి రబీలో ఆయకట్టు ప్రాంతాలకు నీటిని అందిస్తామన్నారు. మంత్రి ఎటుపోయారో అప్పటి నుంచి ఇప్పటికి కనిపించలేదు. సీఎం క్యాంపు కార్యాలయానికి దాదాపు 45 గ్రామాల నుంచి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ 2000 ఉత్తరాలు పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న వైఖరి ఏమిటో చెప్పాలి - ప్రకాశం జిల్లా రైతులు
నీటి వనరుల లేమి వల్ల పశ్చిమ ప్రకాశంలో అధిక సంఖ్యలో ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు. ఫ్లోరైడ్ బాధితులకు డయాలసిస్ కేంద్రాల విషయంలోనూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గత టీడీపీ హయంలో ఏర్పాటు చేసిన కనిగిరి, మార్కాపురంలోని డయాలసిస్ కేంద్రాల్లోని పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనిగిరి ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు మారుస్తానని హామీ ఇచ్చిన జగన్ దానిని అమలు చేయలేదు.
ప్రకాశం జిల్లాకు ప్రధాన ఆదాయ వనరు గ్రానైట్ రంగం. గ్రానైట్ పరిశ్రమల అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిన జగన్ వాటిని అమలు చేయలేదు. గ్రానైట్ పరిశ్రమ చీమకుర్తి, బుదరవాడ, మార్టూరు ప్రాంతాల్లో విస్తరించింది. వందల సంఖ్యలో క్వారీలు, వేల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు ఉండేవి. ఇప్పుడు 80 శాతం పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. క్వారీలు కూడా వైసీపీలో బడా నేతలు చేతుల్లోకి వెళ్లాయి. ఎన్నో సంవత్సరాలుగా క్వారీలు నిర్వహిస్తున్నవారిని బెదిరించి, భయపెట్టి వాటిని స్వాధీనం చేసుకోవడం లేదా వాటా రాయించుకోవడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. మద్దిపాడు గ్రోత్ సెంటర్‌లో దాదాపు 95 పాలిషింగ్ యూనిట్లు ఉండగా వాటిలో దాదాపు 85 మూతపడ్డాయి. చీమకుర్తి, మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో వందల్లో పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. వీటిని తెరిపించేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign
ఐదు సంవత్సరాల పాలనలో సీఎం జగన్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కూడా చేయలేదు. రామయ్యపట్నం వద్ద టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పేపర్ పరిశ్రమని మూలన పడేశారు. జిల్లాలో అత్యధికంగా జామాయిల్, సుబాబుల్ తోటలు ఉన్నాయి. వీటి ధరలు స్థిరీకరించలేదు, కొనుగోళ్లలో బాధ్యత వహించ లేదు. దీంతో సుబాబుల్ రైతులు దళారులు ఇచ్చే ధరతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి కోనుగోళ్లు లేక తోటలను అలాగే వదిలేయాల్సి వస్తుంది. ఒంగోలు డెయిరీ 80 కోట్ల నష్టాల్లో ఉందని పాలు పోసిన రైతులకే రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉందని జగన్ పాదయాత్ర సమయంలో అన్నారు. దీంతో అధికారంలోకి వచ్చాక డెయిరీని గాడిలో పెడతారనుకుంటే 2020లో అమూల్‌కు అప్పగించారు. మరుసటి సంవత్సరం ఒంగోలు డెయిరీ పూర్తిగా మూతపడింది. 104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డెయిరీ భవనాలు, 500 కోట్ల విలువైన సామగ్రి, యంత్రాలు తుప్పు పట్టాయి.
నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు: వైఎస్ షర్మిల - SHARMILA FIRE ON CM JAGAN